కేంద్ర ప్రభుత్వంపై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సంచలన వ్యఖ్యలు చేశారు. కేంద్రప్రభుత్వం, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పై మాటల దాడికి దిగారు మంత్రి. సంజయ్.. నీ మిలియన్ మార్చ్ మోడీ దగ్గర పెట్టుకో.. మా దగ్గర కాదు అంటూ విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
కేంద్రంలో బీజేపీ తెలంగాణ పాలిట శ్రతువుగా మారిందని మంత్రి పేర్కొన్నారు. ఏడాదికి 2కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న బీజేపీ ఉద్యోగాల కల్పనపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో కేసీఆర్ సర్కార్ ఇచ్చినన్ని ఉద్యోగాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు ఇవ్వలేదని మంత్రి ప్రశ్నించారు.
నేను రాజీనామా సవాల్ కు కట్టుబడి ఉన్నా.. సంజయ్ నిరూపిస్తావా..? నీవు సిద్ధమా అంటూ వేముల సవాల్ విసిరిరారు. అరవింద్ పసుపు బోర్డు పేరుతో రైతులను మోసం చేశారని.. అందుకే రైతులు తిరగబడుతున్నారని అన్నారు. బీజేపీ వల్ల రాష్ట్రానికి ఏ ఒక్క రూపాయి అదనంగా రాలేదని ఆరోపించారు. రాష్ట్ర పీఎం కేసీఆర్ కుటుంబాన్ని తిడుతూ రాజకీయ పబ్బం గడుపుతున్నారన్నారు.
నోటికొచ్చినట్లు మాట్లాడితే టీఆర్ఎస్ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. బాల్కొండ అభివృద్ధిపై విమర్శించే వారంతా రాజకీయంగా అడ్రస్ లేనివారని మంత్రి ఎద్దేవా చేశారు. మీరు ఎన్ని కుట్రలు చేసినా..ఎన్ని రాజకీయాలు చేసిన బాల్కొండ అభివృధ్ది ఆగదని మంత్రి వేముల స్పష్టం చేశారు.