” హుజురాబాద్‌లో హరీష్ రావు అడుగుపెడుతున్నారు..ఇక కథ వేరే ఉంటది..” ఇదీ కొద్ది రోజులుగా రాజకీయవర్గాల్లో జోరుగా సాగిన చర్చ. కట్ చేస్తే .. తొలిరోజే తన ప్రచారంలో హరీష్ రావు పరువు తీసుకున్నారన్న మాటలు వినిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా హరీష్ రావు ఏ రోటికాడ ఆ పాట పాడటం బాగా నేర్చుకున్నారని హుజురాబాద్ ప్రజలు అంటున్నారు. కాళేశ్వరం తొలి ఫలితం హుజురాబాద్‌కే అంటూ హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై నవ్వుకుంటున్నారు. మంత్రి తాను ఏ చోటికి వెళ్లినా తెలివిగా ఇదే మాట చెబుతూ ప్రజల్ని బోల్తా కొట్టిస్తున్నారని గుర్తుచేస్తున్నారు.
2018 జూలైలో సాగునీటి మంత్రిగా సూర్యాపేట పర్యటనకు వెళ్లిన హరీష్ రావు.. కాళేశ్వరం తొలి ఫలితం సూర్యాపేట ప్రజలకే అని ప్రకటించారు. ఇక అది మొదలు.. వరంగల్, భూపాలపల్లి, పెద్దపల్లికి, కరీంనగర్, మెదక్, సంగారెడ్డి.. ఇలా ఎక్కడికి వెళ్లినా కాళేశ్వరం తొలి ఫలితం మీకే అంటూ అక్కడి ప్రజలతో చెప్తూ వస్తున్నారు. ఏదో ఒక చోట చెబితే పరవాలేదు కానీ.. తాను వెళ్లిన ప్రతి నియోజకవర్గంలో ఇదే మాట చెప్పడంపై అంతా నోరెళ్లబెడుతున్నారు. మామూలుగా ఆయన మాటలు విన్న ప్రజలే నవ్వుకుంటోంటే.. ఇక సోషల్ మీడియా ఊరుకుంటుందా ఎక్కడెక్కడ ఆ మాటలు మాట్లాడారో అన్నీ పోగేసి… ఆయన్ను ఉతికి ఆరేస్తోంది. ఇప్పుడు కూడా అందుకు సంబంధించిన వీడియో పొలిటికల్ సర్కిల్‌లో వైరల్‌గా మారింది.
https://m.facebook.com/story.php?story_fbid=551415339388474&id=100013665694009
కాళేశ్వరం తొలి ఫలితం మీకేనంటూ పోనీ హరీష్ రావు అబద్ధాలు ఏమైనా చెబుతున్నారా.. కాదు కానీ అతి తెలివి చూపిస్తున్నారు. తాను మాట్లాడింది రాష్ట్రమంతా చూస్తుందన్న విషయాన్ని మరిచిపోయి నోరు జారుతున్నారు. అసలు విషయం ఏమిటంటే కాళేశ్వరం నుంచి ఒకవేళ నీరు వస్తే అది కాకతీయ కాలువ ద్వారా కరీంనగర్, వరంగల్, సూర్యాపేట జిల్లాలకు చేరుతుంది. అంటే ఒకసారి నీరు విడుదల చేస్తే.. ఆయా జిల్లాల్లోని నియోజకవర్గాలని తాకే అవకాశముంది. దీన్నే తెలివిగా హరీష్ రావు.. మీకే తొలి ఫలితం అంటే.. మీకే తొలి ఫలితం అంటూ ఎక్కడికక్కడ నియోజకవర్గాల ప్రజలను ఊరిస్తున్నారు. కాళేశ్వరం లేనప్పుడు కూడా కాకతీయ కెనాల్‌లో నీరు పారింది. కానీ హరీష్ రావే..అతి తెలివిగా వేస్తున్న పాచికే ప్రజలపై పారడం లేదన్న మాటలు వినిపిస్తున్నాయి.