తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మన ఊరు – మన బడి కార్యక్రమంలో భాగంగా మొదటి విడతలో పూర్తైన పాఠశాలలు బుధవారం ప్రారంభమయ్యాయి. సిరిసిల్ల నియోజకవర్గంలోని గంభీరావుపేటలో కేజీ టూ పీజీ క్యాంపెస్ ను మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆధునికీకరించిన 684 బడులు బుధవారం ప్రారంభమయ్యాయి. పనులు పూర్తైన పాఠశాలల్లో త్రాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్, ఫ్లోరింగ్, ఫాల్ సీలింగ్, హ్యాండ్ వాష్, సంప్, టైల్స్, డ్యూయల్ డెస్క్ లు, గ్రీన్ చాక్ బోర్డులు, డిజిటల్ పరికరాలు, కంపౌండ్ వాల్, డైనింగ్ హాల్ , కిచెన్ షెడ్ వంటి మొత్తం 12 రకాల అభివృధ్ది పనులు చేశారు.
అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రిక మన ఊరు – మన బడి కార్యక్రమం అని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కేజీ నుండి పీజీ వరకూ విద్యను రాష్ట్రంలో అందిస్తున్నామని చెప్పారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రాన్ని కేసీఆర్ అన్ని రంగాల్లోనూ ముందుకు తీసుకెళ్తున్నారని కొనియాడారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఇప్పుడు మన మధ్య లేకపోవడం బాధాకరమన్నారు. రాజకీయ ప్రత్యర్థులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం బాగాలేదని కేటీఆర్ చురకలంటించారు.
రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించే వారు పనులు చేయరని అన్నారు. ప్రపంచంలో అతి పెద్ద కార్యక్రమం కంటి వెలుగు అని చెప్పారు. సంక్షేమమే తమ ధ్యేయమని తెలిపారు. వ్యవసాయం, సాగునీరు, విద్య, వైద్య, పరిశ్రమలు ఏ రంగంలో అయిన ముందుకు దూసుకెళ్తున్నామని వివరించారు. గంభీరావుపేటలో ఆరు ఎకరాల విస్తీర్ణంలో నిర్మితమైన ఈ క్యాంపస్ రహేజా కార్ప్ ఫౌండేషన్, మైండ్‌స్పేస్ రిట్, యశోద హాస్పిటల్, ఎమ్మార్‌ఎఫ్, డీవీస్ ల్యాబ్, గివ్ తెలంగాణ, గ్రీన్‌కో సహకారంతో రూ.3 కోట్ల నిధులతో నిర్మించారు.
అనంతరం విద్యాశాఖ మంత్రి సబిత మాట్లాడుతూ.. మొదటి విడతలో ఇప్పటివరకు సుమారు 12 వందల పాఠశాలలను తీర్చిదిద్దినట్లు తెలిపారు. మూడేళ్లలో మూడు దశల్లో రాష్ట్రంలోని 26,055 పాఠశాలల రూపురేఖలు మార్చనున్నట్లు పేర్కొన్నారు. మొదటి దశలో రూ.9,123 కోట్లతో 3,497 బడులను ఆధునికీకరణ చేస్తున్నట్లు చెప్పారు. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా సర్కారు బడులను తీర్చిదిద్దేందుకు 12 రకాల సదుపాయాలను మెరుగుపరుస్తున్నట్లు చెప్పారు. మంత్రి కేటీఆర్ మార్గదర్శంతో పాఠశాలల్లో డైనింగ్ హాల్ ఏర్పాటు చేశామన్నారు. సీఎం కేసిఆర్ దిశా నిర్దేశంతో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధిస్తున్నామని చెప్పారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి.