బీసీల అభ్యున్నతి కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే కృషి చేస్తోందని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. సీఎం కేసీఆర్ బీసీల గురించి ఆలోచించి ఈ 11ఏండ్లలో రూ.48 వేల కోట్ల రూపాయలు కేటాయించారని తాను సగర్వంగా చెబుతున్నానన్నారు.
కులవృత్తులకు చేయూతగా ఉచిత విద్యుత్తును ప్రభుత్వం అందిస్తోందన్నారు. బీసీల విద్య, ఉపాధి కల్పన, సంక్షేమానికి బడ్జెట్‌లో ప్రభుత్వం సముచిత స్థానం కల్పించిందని మంత్రి వెల్లడించారు. అంతే కాకుండా అత్మగౌరవ భవనాల కోసం కోకాపేట, ఉప్పల్ భగాయత్‌లో వేల కోట్ల విలువైన స్థలాలను కేటాయించిందని ఆయన పేర్కొన్నారు.
కోకాపేటలోని ఆరెకటిక, గాండ్ల, రంగ్రేజ్, భట్రాజ్ కులాల ఆత్మగౌరవ భవనాలకు మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్ , తలసాని శ్రీనివాస్ యాదవ్ , శ్రీనివాస్ గౌడ్ శంకుస్థాపన చేశారని ఆయన గుర్తు చేశారు. ఈ నాలుగు భవనాలతో కలిపి ఇప్పటి వరకు మొత్తం 29 ఆత్మగౌరవ భవనాలకు శంకుస్థాపన చేసినట్టు చెప్పారు.
రాష్ట్రంలోని 41 బీసీ కులాలకు రూ.95.25 కోట్లు విలువ చేసే 87.3 ఎకరాలు కేటాయించారని ఆయన పేర్కొన్నారు. తమ కులం ఖ్యాతి ఇనుమడించేలా ఈ ఆత్మగౌరవ భవనాలను కట్టుకునేందుకు ఆయా సంఘాలకే అవకాశం కల్పించారని ఆయన గుర్తు చేశారు.
స్వాతంత్య్రం వచ్చిన ఇన్నేండ్లలో బీసీలను ఓటు బ్యాంకుగా మాత్రమే చూశారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మన అవసరాలను ఏ ప్రభుత్వమూ తీర్చలేదని ఆయన అన్నారు. వృత్తులుగా విడిపోయినా బీసీ వర్గాల డీఏన్ఏ ఒకటేనని ఆయన చెప్పారు. వేలంలో కోకాపేట్ భూమికి ఒక ఎకరానికి 85 కోట్లు పలికిందన్నారు. ఈ విషయాన్ని సీఎంకు అధికారులు చెప్పారని, బీసీ బిడ్డల కంటే ఏదీ ముఖ్యం కాదని ఆయన అన్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.