రాష్ట్రంలో మహిళలకు టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీఠ వేస్తోందని మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాఠోడ్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ఎల్పీ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. మహిళల అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని కొనియాడారు. ఈ నెల 6,7,8 తేదీల్లో మహిళా బంధు-కేసీఆర్.. పేరిట సంబురాలు జరపనున్నట్టు తెలిపారు.
బాలిక పుడితే రూ.13 వేలతో పాటు.. కేసీఆర్ కిట్లు పంపిణీ చేసే ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ అని అన్నారు. అంతేకాకుండా పెళ్లీడుకొచ్చిన ఆడపిల్లలకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ రూపంలో సాయం అందించే ఘనత ఒక్క కేసీఆర్ కే సాధ్యం అవుతోందన్నారు. దీంతో పదిలక్షల కుటుంబాలకు మేలు జరిగిందని పేర్కొన్నారు. కేసీఆర్ కిట్ ద్వారా సుమారు 11 లక్షల మంది లబ్ధి పొందారని తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం షీ టీమ్స్, భరోసా కేంద్రాలను మహిళల కోసం ఏర్పాటు చేసిందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. వాటి అండతో మహిళలు ధైర్యంగా తిరుగుతున్నారని తెలిపారు. మహిళా సంఘాల ద్వారా చిన్న చిన్న అవుట్ లెట్లు ఏర్పాటు చేసి.. ప్రతి గ్రామంలో మహిళా సంఘం ఆధ్వర్యంలో చిన్న చిన్న షాపులు ఏర్పాటు చేసుకునేలా సదుపాయం కల్పించి.. మహిళలను వ్యాపార దిశగా ప్రోత్సహిస్తోందని సబిత అన్నారు.
ప్రసవం తర్వాత మహిళకు కడుపునిండా భోజనం, సరైన మందులు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ అన్నారు. ఈ నేపథ్యంలో మాతా-శిశు మరణాలు తగ్గాయని పేర్కొన్నారు. మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిందని అన్నారు రాఠోడ్.