జనసేన, టీడీపీ కలిస్తే వైసీపీకి ఇబ్బందే. 2014 ఎన్నికల్లో జరిగింది అదే. కానీ, అప్పుడు వైసీపీది ప్రతిపక్షం. ఇప్పుడు అధికారపక్షం. మరి.. 2024లో అదే సీన్ రిపీట్ అవుతుందా? టీడీపీ, జనసేన కలుస్తాయా? చంద్రబాబు, పవన్ భేటీ అందుకేనా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి.
అయితే.. బాబు, పవన్ భేటీపై తమదైన రీతిలో వైసీపీ నేతలు రియాక్ట్ అవుతున్నారు. మంత్రులు ఒక్కొక్కరుగా ఎటాక్ స్టార్ట్ చేశారు. మంత్రి గుడివాడ అమర్ నాథ్ స్పందిస్తూ… సంక్రాంతి పండుగ మామూళ్ళ కోసం దత్తతండ్రి చంద్రబాబు వద్దకు దత్త పుత్రుడు పవన్ కళ్యాణ్ వెళ్లారని చురకలంటించారు.
ఇక మంత్రి అంబటి రాంబాబు స్పందిస్తూ.. సంక్రాంతికి అందరింటికి గంగిరెద్దులు వెళ్తాయి.. చంద్రబాబు ఇంటికి పవన్ కళ్యాణ్ వెళ్ళాడు.. డుడు బసవన్నలా తల ఊపడానికి అంటూ సెటైర్లు వేశారు. ట్విట్టర్ లో పోస్ట్ పెట్టిన అంబటి.. పవన్, చంద్రబాబును ట్యాగ్ చేశారు.
2014లో టీడీపీ, బీజేపీకి మద్దతు ప్రకటించింది జనసేన. 2019లో మాత్రం ఎవరి దారి వారు చూసుకున్నారు. కానీ, వైసీపీ మాత్రం చంద్రబాబు డైరెక్షన్ లోనే పవన్ పయనిస్తున్నారని విమర్శలు చేస్తూ వస్తోంది. దత్త పుత్రుడు అంటూ ఎగతాళి చేస్తుంటుంది. దీనిపై వైసీపీ, జనసేన మధ్య వార్ జరుగుతూనే ఉంది. అయితే.. ఇప్పుడు చంద్రబాబు ఇంటికి పవన్ వెళ్లడంతో మాటల దాడిలో మరింత స్పీడ్ పెంచాయి వైసీపీ వర్గాలు.