క్షణికావేశం ప్రాణాలనే మింగేస్తుంది. ఆ ఆవేశంలో చిన్న చిన్న కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడడం సాధారణంగా మారిపోతుంది. అయితే మైనర్ పిల్లలు కూడా తల్లిదండ్రులు మందలించారని, మార్కులు తక్కువగా వచ్చాయన్న చిన్న కారణాలకే సూసైడ్ చేసుకునేందుకు సిద్ధమవ్వడం ఆందోళనను కల్గిస్తోంది.కన్న వారికి కడు విషాదాన్ని మిగుల్చుతుంది.
తాజాగా ఇలాంటి సంఘటనే రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్ లో చోటుచేసుకుంది. హైదర్ షాకోట్ లో ఓ మైనర్ బాలుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. తండ్రి మందలించాడనే మనస్తాపంతో క్షణికావేశంలో.. ఒంటి పై కిరోసిన్ పోసుకొని నిప్పు అంటించుకున్నాడు. ఈ విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించే లోపే అతడు తీవ్ర గాయాలపాలయ్యాడు.
దీంతో అతడ్ని హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు తల్లిదండ్రులు. బాలుడికి చికిత్స అందిస్తున్న వైద్యులు.. అతడి పరిస్థితి విషమంగానే ఉందని చెబుతున్నారు. అయితే మందలించినందుకే ఇంతటి అఘాయిత్యానికి పాల్పడిన కొడుకును చూసి తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. ఎలాగైనా ప్రాణాలను నిలబెట్టాలని వైద్యులను వేడుకుంటున్నారు. మరో వైపు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.