వారు చదివేది ఇంటర్.. ఇంకా మైనార్టీ కూడా తీరలేదు. ఆ వయస్సులో ఆడ, మగ మధ్య ప్రేమ సహజమే కానీ వారు అంతకంటే ముందుకు వెళ్లారు. తాము చదివే కాలేజీనే కల్యాణ వేదికగా మార్చుకున్నారు. క్లాస్ రూంలోని బెంచిలనే పెళ్లి పీఠలుగా చేసుకున్నారు. మరో స్నేహితురాలిని పెళ్లి పెద్దగా చేసుకొని… ఆ అబ్బాయి తాను ప్రేమించిన అమ్మాయి మెడలో పసుపు కొమ్ముకట్టాడు.ఆపై పెళ్లి అయిపోయిందని సంబరపడ్డారు. చదువుతుంటే ఏదో సినిమాలో జరిగిన సీన్‌లా అనిపిస్తున్నా.. తూర్పు గోదావరి జిల్లాలో నిజంగానే ఈ ఘటన జరిగింది.
రాజమండ్రి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో చదువుతున్న విద్యార్థులు.. తరగతి గదిలోనే పెళ్లి చేసుకోవడం కలకలం రేపుతోంది. నవంబర్ 17వ తేదీన ఈ తతంగం జరగగా.. ఆలస్యంగా ఆ వీడియోలు బయటకు రావడమేగాక.. సోషల్ మీడియాలనూ వైరల్గా మారాయి. విషయం తెలుసుకున్న కాలేజీ ప్రిన్సిపల్ ఆ ఇద్దరు విద్యార్థులతో పాటు వారికి సహకరించిన మరో విద్యార్థినికి కూడా టీసీ ఇచ్చి పంపించారు.