నాయకులను ఎందుకు ఎన్నుకుంటాం. ఊరికి సౌకర్యాలు కల్పిస్తారని.. మంచిగా చూసుకుంటారని. కానీ, ఇందుకు విరుద్ధంగానే జరుగుతుంటుంది. ఊరికి అన్ని సౌకర్యాలు కల్పించడం.. అందర్నీ మంచిగా చూసుకోవడం అనేది సినిమాల్లోనే. రియల్ గా అన్నిచోట్లా ఇవి జరగవు. ప్రశ్నిస్తే బెదిరింపులు.. సాయం చేయమని అభ్యర్థిస్తే చీదరింపులు ఎదురవుతుంటాయి ప్రజలకు. ఇవన్నీ ఆఫ్ లైన్ లోనే ఎక్కువగా జరుగుతుంటాయి. అయితే.. ఓ ఎమ్మెల్యే మీడియా ముఖంగానే ప్రజలను బెదిరించడం చూశారా?
తనకు వ్యతిరేకంగా మాట్లాడేవారు.. కేసీఆర్ ప్రభుత్వ పథకాలు తీసుకోవద్దని అంటున్నారు మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కరరావు. దామరచర్ల మండలంలోని నర్సాపూర్ గ్రామానికి వెళ్లిన ఆయన.. స్థానికులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నం పెట్టే వారికి సున్నం పెడుతున్నారంటూ మండిపడ్డారు. ‘‘నా సంగతి మీకు తెలియదు..అందరినీ డ్యాన్స్ చేయిస్తా’’ అంటూ ఓ రేంజ్ లో ఫైరయ్యారు.
తమకు వ్యతిరేకంగా ఉండేవారు కేసీఆర్ వేసిన రోడ్లపై నడవొద్దన్నారు భాస్కరరావు. అంతేకాదు, రైతుబంధు, పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి, పథకాలు ఎందుకు అంటూ ప్రశ్నించారు. ఒకవేళ పథకాలన్నీ తీసుకుంటాం.. తమకు నచ్చిన డ్యాన్స్ చేస్తామంటే.. చూస్తూ ఊరుకోమని.. తాను కూడా డ్యాన్స్ చేయిస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు. మర్యాదగా ఉంటే చెరుగు గడ.. లేదంటే రగడ.. అంటూ సినిమా స్టయిల్ లో మండిపడ్డారు.
తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తరువాత ఏం జరిగిందో నర్సాపూర్ ప్రజలు ఓసారి ఆలోచించాలన్న ఎమ్మెల్యే.. ఆలోచన చేయకపోతే మీ అంతట మీరే ఇబ్బందులు ఎదుర్కున్నవారు అవుతారు.. తమకేం ఇబ్బంది లేదంటూ మాట్లాడారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.