మిస్ అమెరికా 2019 చెస్లీ క్రిస్ట్ మృతి చెందింది. 60 అంతస్తుల భవనం నుంచి కిందపడి ఆదివారం ప్రాణాలు కోల్పోయింది. ఓ యువతి బిల్డింగ్‌పై నుంచి కిందకు పడి చనిపోయిందనే సమాచారం అందడంతో ఘటనా స్థలానికి చేరుకున్నామని న్యూయార్క్ పోలీసులు చెప్పారు. తరువాత మృతి చెందిన యువతి 2019లో మిస్ అమెరికా టైటిల్ గెలుచుకున్న చెస్లీ క్రిస్ట్ గా గుర్తించామని చెప్పారు.
మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. బిల్డింగ్ లోని 29 అంతస్తు నుంచి దూకి ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే.. ఆత్మహత్యకు కారణాలు ఇంకా తెలియాల్సి ఉందన్నారు. పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తరువాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.
చెస్లీ క్రిస్ట్ 1991లో మిషిగాన్ జాక్సన్లో జన్మించింది. సౌత్ కరోలినాలో పెరిగింది. వేక్ ఫారెస్ట్ యూనివర్సిటీలో ఎంబీఏ చేసింది. లా డిగ్రీ కూడా పూర్తి చేసింది. అనంతరం స్థానికంగా ఉన్న న్యూస్ ఛానల్‌లో ఆమె రిపోర్టర్‌గా పని చేసింది. 2019 మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొన్న ఆమె టైటిల్ గెలుచుకుంది.
చెస్లీ క్రిస్టీ ఆత్మహత్యపై మిస్ యూనివర్స్ 2021 హర్నాజ్ సంధు స్పందించారు. ఈ వార్త తనను ఎంతో బాధించిందని సంధు తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేశారు. చెస్లీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ ఆమెతో కలిసి దిగిన ఫొటోలను ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేశారు.