చెన్నై లోని బీజేపీ కార్యాలయంపై పెట్రోల్ బాంబుతో దాడి చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నీట్ బిల్లుకు బీజేపీ మద్దతిస్తుండటంతోనే ఆగ్రహంతో ఈ దాడికి పాల్పడినట్టు విచారణలో నిందితుడు చెప్పినట్టు పోలీసులు వెల్లడించారు. పోలీసుల వివరాల ప్రకారం…
గురువారం తెలవారు జామున కొందరు దుండగులు ద్విచక్ర వాహనాలపై వచ్చి బీజేపీ కార్యాలయంపై పెట్రోల్ బాంబులు విసిరారు. అనంతరం అక్కడి నుంచి వారు పారిపోయారు. సీసీ టీవీ పుటేజ్ ల సహాయంతో వారిలో ఒకరిని పోలీసులు పట్టుకున్నారు.
నిందితుడిని కుడుక వినోద్ గా గుర్తించారు. గతంలో వినోద్ పలు కేసుల్లో నిందితుడు. 2015లో ఓ లిక్కర్ షాపుపై, 2017లో తేయనాంపేట పోలీసు స్టేషన్ పై బాంబులు విసిరిన కేసులు వినోద్ పై ఉన్నాయి.
అయితే నిందితుడికి ఏ మత సంస్థలతో గాని, రాజకీయ పార్టీతో గానీ సంబంధం లేదని పోలీసులు తెలిపారు. కేవలం మద్యం మత్తులో ఈ దాడికి పాల్పడి ఉంటాడని ప్రాథమికంగా నిర్ధారించినట్టు తెలిపారు.