‘మిస్ యూనివర్స్-2022’ గా అమెరికాకు చెందిన ఆర్.బోన్నీ గ్యాబ్రియెల్ ఎంపికైంది. 28 ఏళ్ళ ఈ మోడల్, ఫ్యాషన్ డిజైనర్ కూడా.. ఆమెకు మాజీ మిస్ యూనివర్స్, పంజాబ్ సుందరి హర్నాజ్ సంధు .. విశ్వసుందరి కిరీటాన్ని అలంకరించింది. మిస్ వెనిజులా అమండా ఢుడమెల్ రన్నరప్ కాగా.. , డొమినికా రిపబ్లికన్ సుందరి ఆండ్రినా మార్టినెజ్ మూడో స్థానంలో నిలిచింది.
అయితే ఇండియాకు చెందిన దివితా రాయ్ ..టాప్ 16 లో చోటు దక్కించుకున్నా.. టాప్ 5 కి అర్హత సాధించలేకపోయింది. 25 ఏళ్ళ ఈమె 2021 లో కూడా మిస్ దివా, మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొంది. . ఆ పోటీల్లో హర్నాజ్ సంధు కిరీటాన్ని దక్కించుకోవడంతో ఈమె రన్నరప్ గా నిలిచింది. కర్ణాటక లోని మంగళూరుకు చెందిన దివితా రాయ్ 2019 లో ఫెమినా మిస్ ఇండియా పోటీలకు అర్హత సాధించింది. ఆమె 2022 సంవత్సరానికి మిస్ యూనివర్స్ టైటిల్ గెలుచుకుంటుందన్న భారత్ ఆశలు అడియాసలయ్యాయి.
భారత్ నుంచి ఇప్పటివరకు సుస్మితా సేన్, లారా దత్తా, హర్నాజ్ సంధు ఈ టైటిల్ సాధించారు. ఇక ఈ ఏడాది అమెరికాలోని న్యూఆర్లీన్స్ లో నిర్వహించిన మిస్ యూనివర్స్ పోటీల్లో 80 దేశాలకు చెందిన అందాల భామలు పాల్గొన్నారు.
కుట్టు శిక్షకురాలు కూడా అయిన బోన్నీ గ్యాబ్రియెల్ తండ్రి అమెరికన్ కాగా.. తల్లి ఫిలిపీన్స్ కి చెందినవారు. గత ఏడాది అక్టోబరులో బోన్నీ .. మిస్ యుఎస్ఏ గా కూడా ఎంపికయింది. పర్యావరణ పరిరక్షణ పట్ల తనకెంతో ఆసక్తి ఉందని తెలిపిన ఈ విశ్వ సుందరి.. తన సొంత దుస్తుల శ్రేణి..’ఆర్ బోనీ నోలా’ కి సీఈఓగా వ్యవహరిస్తోంది. హైస్కూల్ చదివే రోజుల్లోనే ఫ్యాబ్రిక్, టెక్స్ టైల్స్, డిజైనింగ్ మీద ఆసక్తి చూపిన ఆమె.. సమాజంలో నిరాదరణకు గురైన మహిళల అభివృద్ధి కోసం తాను నిరంతరం కృషి చేస్తానని వెల్లడించింది.