పుట్టిన రోజు వేడుకలకు వెళ్తున్నామని చెప్పి బయటకు వచ్చిన ముగ్గురు బాలికలు అదృశ్యమై 24 గంటలు గడిచాయి. హైదరాబాద్ తిరుమలగిరిలో చోటుచేసుకున్న ఈ సంఘటనలో పిల్లలు ఇంటికి రాకపోవడంతో వాళ్ల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. పిల్లల ఆచూకీని సాధ్యమైనంత త్వరగా కనిపెట్టాలని వారు పోలీసులను వేడుకుంటున్నారు.
ఇక వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ లోని తిరుమలగిరికి చెందిన పరిమలా అనే బాలిక తొమ్మిదో తరగతి చదువుతోంది. ఆమె పుట్టిన రోజు సందర్భంగా స్థానికంగా ఉన్న స్నేహితులు హసీనా, స్వప్నతో కలిసి పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవాలనుకుంది. ఈ క్రమంలో ముగ్గురూ ఫ్రెండ్స్ కలిసి ఇంటి నుంచి బయటికెళ్లారు.
అయితే రోజంతా ఇంటికి తిరిగి రాని పిల్లలు.. చీకటి పడినా కూడా రాకపోవడంతో.. వాళ్ల తల్లిదండ్రులు ఒకరినొకరు సంప్రదించుకొని బాలికలకు ఫోన్ చేస్తే.. వాళ్ళ ఫోన్లు స్విఛ్ ఆఫ్ వచ్చాయి. దీంతో కుటుంబ సభ్యులు తెలిసిన వారికి కూడా సంప్రదించడంతో.. పిల్లలు రాలేదన్నారు. దీంతో వారి ఎలాంటి ఆచూకీ లభించకపోవడంతో ఆందోళన ఎక్కువైంది.
దీంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ఏం జరిగింది అనే విషయమంతా పోలీసులకు వివరించి ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి, బాలికల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు అమ్మాయిల మిస్సింగ్ కేసును పోలీసులు సవాల్ గా తీసుకున్నారు. బాలికల ఆచూకీ కోసం సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు.