ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైన తిరుపతిలో మిస్సింగ్ కేసులు కలకలం రేపుతున్నాయి. గత మూడు రోజుల్లో ఐదుకు పైగా కేసులు నమోదయ్యాయి. తొలుత సత్యనారాయణపురానికి చెందిన మోనిషా అనే మైనర్ బాలిక కనిపించకుండా పోయింది. గుడికి వెళ్ళిన ఈ బాలిక తిరిగి ఇంటికి రాలేదు.
ఇదిలా ఉంటే.. చెన్నారెడ్డి కాలనీలో 8వ తరగతి చదువుతున్న వంశీ కృష్ణా ఐస్ క్రీమ్ కోసం వెళ్ళి అదృశ్యమయ్యాడు. అనంతరం లక్ష్మీపురానికి చెందిన వివేక్ కూడా మిస్సింగ్ అంటూ మరో ఫిర్యాదు అందింది. తాజాగా.. మరో వివాహిత మిస్ అయ్యింది.
తిరుపతికి చెందన రేణుక అనే యువతికి 2019లో నంద్యాలకు చెందిన నీటిపారుదల శాఖ జూనియర్ అసిస్టెంట్ మహేశ్వర్ తో వివాహమైంది. ఈమధ్య కాలంలో క్రికెట్ బెట్టింగ్ లో 35 లక్షలు కోల్పోయిన మహేశ్వర్.. పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయాడు. అవి కట్టలేక అతను ఇంటి నుంచి వెళ్ళిపోయాడు.
దీంతో రేణుకు తల్లిగారింటికి వచ్చింది. అక్కడ అయిదు రోజులు కుటుంబ సభ్యులతో ఉన్న రేణుక.. ఆరవ రోజు కనిపించకుండా పోయింది. కంగారుపడ్డ తల్లితండ్రులు రేణుక జాడ కోసం వెతుకుతుండగానే.. మహేశ్వర్ నుంచి రేణుక తండ్రి ఫోన్ కు ఓ మెసేజ్ వచ్చింది.
‘మా ఇబ్బందులేవో మేము పడతాం.. మీరు ఆందోళన చెందొద్దు.. మా గురించి ఆలోచించొద్దు’ అంటూ మహేశ్వర్ మెసేజ్ పంపాడు. దీంతో ఆందోళన చెందిన రేణుక తండ్రి.. వెంటనే అలిపిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పుల టెన్షన్ తో ఎక్కడ భార్యాభర్తలిద్దరు ఆత్మహత్య చేసుకుంటారోనని భయాందోళనలకు గురవుతున్నారు.