పండగ పూట తీవ్ర విషాదం నెలకొంది. అప్పటివరకు కళ్లముందు కనిపించిన పిల్లలు ఒక్కసారిగా కనిపించని లోకాలకు వెళ్లిపోయారు. పుణ్యస్నానాలకు వచ్చిన వారికి తీరని శోకం మిగిల్చారు. శనివారం గోదావరి నదిలో ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు..
ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని రొయ్యురు గ్రామానికి చెందిన.. సతీష్, సాయి, సందీప్‌లు ఉగాది సందర్భంగా గ్రామస్థులతో కలిసి గోదావరి పుణ్యస్నానాలకు వెళ్లారు. స్నానాలు ఆచరించేందుకు నదిలోకి దిగారు. అయితే, ఒక్కసారిగా ప్రవాహం అధికంగా ఉండటంతో ముగ్గురు యువకులు నీటి ప్రవాహాంలో కొట్టుకుపోయారు. అప్పటివరకు కళ్లముందు కనిపించిన పిల్లలు నీట మునిగారు. దీంతో గోదావరి తీరం శోకసంద్రంగా మారిపోయింది.
ఈ ప్రమాదంలో కొట్టుకుపోయిన వారంతా విద్యార్థులే. ఇద్దరు ఇంటర్మీడియెట్ చదువుతుండగా, మరో విద్యార్థి తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసు, రెవిన్యూ సిబ్బంది స్పాట్ చేరుకుని, గల్లంతైన వారి ఆచూకీకోసం గజఈతగాళ్ల సాయంతో ప్రత్యేక గాలింపుచర్యలు చేపట్టారు. ముగ్గురు విద్యార్థులు గల్లంతవ్వడంతో ఆ ప్రాంతమంతా విషాదవదనంగా మారిపోయింది.
Advertisements
ఈ ఘటనతో రొయ్యురు గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది. పండుగ పూట పుణ్యస్నానాలకు వెళ్తే.. ఇలా జరగటంతో గ్రామస్థులంతా తీవ్ర విషాదం వ్యక్తం చేస్తున్నారు