తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకం నీరుగారిపోతోంది. పనుల్లో జరిగిన లోపంతో పైపులు లీకేజీ అయి భారీగా నీటి నష్టం జరుగుతోంది. సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ప్రజాధనం వృథా అవుతోంది. ఎక్కడికక్కడ పైప్ లైన్లు పగిలి తాగునీరు వృథాగా పోతోంది. తాజాగా వరంగల్ జిల్లాలో పైప్ లైన్ పగిలింది.
జిల్లాలోని ఖానాపురం మండల కేంద్రం సమీపంలోని భగీరథ పైప్ లైన్ పగిలింది. దీంతో సముద్రాన్ని తలపించేలా ఉవ్వెత్తున నీరు ఎగిసిపడుతూ సునామీని తలపించింది. ఉధృతంగా ఎగిసిపడుతున్న నీళ్లు మహబూబాబాద్ నర్సంపేట రహదారిపైకి పొంగిపొర్లుతున్నాయి.
దీంతో రాకపోకలకు ఇబ్బందిగా మారింది. రహదారిపై వాహనాలు అటూ ఇటూ నిలిచిపోయాయి. అయితే తాగు నీరు వృథాగా పోతున్నా ఏ అధికారి మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీన్ని చూసిన పలువురు సెల్ ఫోన్లలో వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అది వైరల్ గా మారింది.