మహిళల క్రికెట్ లో సచిన్ గా పిలవబడి మిథాలీ రాజ్ రిటైర్మెంట్ ప్రకటించింది. తన సుదీర్ఘ కెరీర్ కు ఫుల్ స్టాప్ పెట్టేసింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది మిథాలీ. ఈ హైదరాబాదీ ప్లేయర్ క్రికెట్ లో ఎన్నో రికార్డులు క్రియేట్ చేసింది. మొన్నటి వరల్డ్ కప్ లో కూడా సరికొత్త రికార్డును అందుకుంది. అత్యధిక సార్లు ప్రపంచ కప్ ఆడిన భారత మహిళా క్రికెటర్ గా రికార్డులకెక్కింది.
1999లో తొలిసారి వన్డే ఇంటర్నేషనల్ లో పాల్గొంది మిథాలీ. ఈ మ్యాచ్ ఐర్లాండ్ లోని మిల్టన్ కీన్స్ లో జరిగింది. ఇందులో మిథాలీ 114 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచింది. 2001-02లో మొదటి టెస్ట్ మ్యాచ్ ఇంగ్లాండ్ పై లక్నోలో ఆడింది. టాంటన్ లో ఇంగ్లాండ్ తో జరిగిన టెస్టు మ్యాచ్ లో 264 పరుగులు సాధించి మహిళా క్రికెట్ లో ప్రపంచ రికార్డు సృష్టించింది. 2005 మహిళా ప్రపంచ కప్ ఫైనల్స్ లో భారత జట్టుకు నేతృత్వం వహించింది. స్వతహాగా బ్యాటింగ్ చేసే మిథాలీ అప్పుడప్పుడు బౌలింగ్ కూడా చేసేది.
మిథాలీ తన అంతర్జాతీయ క్రికెట్ క్రీడాజీవితంలో 93 వన్డేలలో భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించి 45.50 సగటుతో 2,776 పరుగులు సాధించింది. ఇందులో 2 సెంచరీలు, 20 అర్థ సెంచరీలు ఉన్నాయి. వన్డేలలో ఆమె అత్యధిక స్కోరు 114 నాటౌట్. టెస్టులలో 8 మ్యాచ్ లు ఆడి 52 సగటుతో 522 పరుగులు సాధించింది. ఇందులో ఒక సెంచరీ, 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టెస్ట్ క్రికెట్ లో అత్యధిక స్కోరు 214 పరుగులు.
క్రీడారంగంలో ఈమె చేసిన సేవలకు గాను పద్మశ్రీ, అర్జున అవార్డులు లభించాయి. అలాగే ‘మేజర్ ధ్యాన్ ద్ ఖేల్రత్న’ అవార్డును కూడా అందుకుంది.