టోక్యో ఒలింపిక్స్‌లో ఇండియన్ మెన్స్ హాకీ టీం కాంస్య పతకం గెలుచుకోవడంపై దేశమంతా సంబరాలు జరుపుకుంటోంది. అయితే దేశవ్యాప్తంగా జరుగుతున్న వేడుక ఒక ఎత్తయితే.. ఆ గ్రామంలో జరిగే వేడుక మరో ఎత్తు అన్నట్టుగా మారింది. పంజాబ్ జలంధర్‌లోని మిథాపూర్.. ఇప్పుడు దేశ ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇంతకి అక్కడే ఎందుకు అంతలా సెలబ్రేషన్స్ జరుగుతున్నాయనే కదా మీ సందేహం? అందుకు పెద్ద కారణమే ఉంది.
మిథాపూర్ గ్రామం కాదు.. హాకీ క్రీడాకారులకు పుట్టినిల్లు. అవును.. టోక్యో ఒలింపిక్స్‌లో ఆడి భారత్‌కు చారిత్రక విజయాన్ని సాధించి పెట్టిన జట్టులో ఏకంగా ముగ్గురు హాకీ ప్లేయర్లు ఈ గ్రామానికి చెందినవారే. కెప్టెన్ మన్ ప్రీత్ సింగ్ అలాగే అతని సహచరులు మన్ దీప్ సింగ్ , వరుణ్ కుమార్- అందరూ మిథాపూర్ నుంచే వచ్చారు. ప్రస్తుత జట్టులో ఉన్న ఈ ముగ్గురు ఆటగాళ్లే కాదు.. గతంలో మిథాపూర్‌కు చెందిన మరో ముగ్గురు కూడా గత ఒలింపిక్స్‌లో సత్తా చాటారు.
1952 నాటి ఒలింపిక్స్‌లో పాల్గొన్న స్వరూప్ సింగ్.. 1972లో జరిగిన ఒలింపిక్స్‌కు వెళ్లిన కుల్వంత్ సింగ్ .. ఇక 1988, 1992, 1996 లో పాల్గొన్న పర్గత్ సింగ్ – అందరూ మిథాపూర్‌లోనే శిక్షణ పొందారు. స్వాతంత్య్రానంతరం మిథాపూర్ హాకీ క్రీడాకారులకు నిలయంగా మారింది. హాకీలో అగ్రస్థానాన్ని చేరుకోవాలనే ఆశతో డజన్ల కొద్దీ పిల్లలు మిథాపూర్‌లో శిక్షణ పొందుతున్నారు.