కేంద్ర బడ్జెట్- 2023 పై రాహుల్ గాంధీ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. దేశ భవిష్యత్ నిర్మాణానికి ఎలాంటి దిశా నిర్దేశం లేదని పేర్కొన్నారు. ఇదంతా ‘మిత్ర్ కాల్ బడ్జెట్’అని అన్నారు. అంతకు ముందు బడ్జెట్ పై నిర్మలా సీతారామన్ ను ప్రధాని మోడీ అభినందించారు.
ఈ బడ్జెట్‌లో ఉద్యోగాల కల్పనకు సంబంధించిన విజన్ లేదని ఆయన ట్వీట్ చేశారు. పెరుగుతున్న ధరలకు అడ్డుకట్ట వేసే ప్రణాళిక ఇందులో లేదన్నారు. అసమానతలకు అడ్డుకట్టవేసే ఉద్దేశం ఎక్కడా లేదని వెల్లడించారు. దేశంలో ఒక శాతం ధనవంతలు వద్ద 40శాతం సంపద ఉందన్నారు.
దేశంలో 50 శాతం పేద ప్రజలు 64 శాతం జీఎస్‌టీ చెల్లిస్తున్నారని చెప్పారు. దేశ యువకుల్లో 42 శాతం మంది ఇప్పటికీ నిరుద్యోగ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. వీటిపై ప్రధాని మోడీకి ఎలాంటి పట్టింపులూ లేవని చెప్పారు.
దేశ భవిష్యత్ నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వానికి ఎలాంటి దిశానిర్దేశం లేదని ఈ బడ్జెట్ రుజువు చేస్తోందన్నారు. మరోవైపు బడ్జెట్ పై కాంగ్రెస్ కూడా విమర్శలు గుప్పించింది. ఆర్భాటం ఎక్కువ, ఆచరణ తక్కువని బడ్జెట్ పై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు.