హైదరాబాద్ లో ”దిశ” నిందితుల ఎన్ కౌంటర్ పై బీజేపీలో మిశ్రమ స్పందన కనిపిస్తోంది. కొంత మంది ఎన్ కౌంటర్ చేసిన పోలీసులను సమర్ధిస్టుంటే ఆ పార్టీకే చెందిన మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వాన్ని, పోలీస్ కమిషనర్ ను మీడియా ముందు ఎన్ కౌంటర్ వివరాలు వెల్లడించాలని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కృష్ణసాగర్ రావు డిమాండ్ చేశారు. బీజేపీ ఒక బాధ్యతాయుతమైన జాతీయ పార్టీగా వ్యవహరిస్తుందని చెప్పారు. ఇండియా నియంతృత్వ దేశం కాదు…దీనికో రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగ పరిధిలోనే అందరూ పనిచేయాలి. నేరాల మీద రాజకీయం చేయడం తగదు అన్నారు. తెలంగాణ డీజీపీ వెంటనే మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించాలి. ఆ తర్వాతనే మేము స్పందిస్తామని చెప్పారు.
దూల్ పేట బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందన మాత్రం మరోలా ఉంది. ఎన్ కౌంటర్ చేసిన తెలంగాణ పోలీసులను ఆయన అభినందించారు. దేశమంతా ఇలాంటి శిక్షలే అమలు చేయాలని కూడా రాజాసింగ్ కోరారు.
మాజీ కేంద్ర మంత్రి రాజవర్ధన్ సింగ్ రాథోడ్ కూడా ఎన్ కౌంటర్ ను సమర్ధించారు. హైదరాబాద్ పోలీసులకు..వారి విధులు వారు నిర్వర్తించేలా చేసిన నాయకత్వానికి అభినంధనలు అంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.