తమిళనాడు సీఎం ఎం.కె. స్టాలిన్ రెండో సారి డీఎంకే అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. ఆదివారం చెన్నైలో జరిగిన పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశంలో ఆయనను పార్టీ నేతలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే ఇరిగేషన్ శాఖా మంత్రి దురైమురుగన్ తిరిగి ప్రధాన కార్యదర్శిగా, మాజీ కేంద్ర మంత్రి టీ.ఆర్. బాలు కోశాధికారిగా ఎన్నికయ్యారు.
ఈ సమావేశంలో పార్టీ ఎంపీ కనిమొళిని డిప్యూటీ జనరల్ సెక్రటరీగా ఎన్నుకోవడం విశేషం. సహకార శాఖ మంత్రి పెరియసామి, ఉన్నత విద్యా శాఖ మంత్రి కె. పొన్ముడి, మాజీ కేంద్ర మంత్రి ఏ. రాజా, ఎంపీ అంతియుర్ సెల్వరాజ్ ను కూడా ఈ పదవి వరించింది.
ఇటీవల మాజీ మంత్రి సుబ్బులక్ష్మి జగదీశన్ పార్టీకి రాజీనామా చేయడంతో ఆమె స్థానే కనిమొళిని డిప్యూటీ జనరల్ సెక్రటరీగా ఎన్నుకుంటారని స్పష్టమైంది.
ఆమె ఇదివరకే డీఎంకే మహిళా విభాగానికి హెడ్ గా ఉన్నారు. ఆదివారం జరిగిన సమావేశానికి సుమారు 500 మంది పార్టీ కార్యకర్తలు హాజరయ్యారు.
దివంగత పార్టీ చీఫ్ ఎం. కరుణానిధి చిన్న కొడుకైన స్టాలిన్ లోగడ పార్టీలో పలు పదవులు నిర్వహించారు. డీఎంకే ట్రెజరర్ గా, యువజన విభాగం కార్యదర్శిగా వ్యవహరించారు. 2018 లో తన తండ్రి మరణానంతరం పార్టీ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.