ఏపీ అసెంబ్లీలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అధికార ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు వ్యక్తిగత విమర్శలు చేసుకుంటున్నారు. ప్రశ్నోత్తరాల సమయంలో రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని మాట్లాడిన మాటలు వైసీపీ ప్రభుత్వానికి, జగన్ కు పరీక్షగా మారాయి.
మహిళకు పెద్దపీట వేశాము.. మహిళలపై అసభ్యకరంగా ప్రవర్తించినా సహించేది లేదని ముఖ్యమంత్రి జగన్ చెప్పారు. కానీ సోమవారం మద్యంపై మాట్లాడినందుకు నా మీద సోషల్ మీడియాలో అసభ్యకర పోస్ట్ లు పెట్టారని, అందులో వైసీపీ కార్యకర్తలు కూడా ఉన్నారని ఆరోపించారు. ఒక మహిళా ఎమ్మెల్యేపై ఇలా అసభ్యకరంగా పోస్ట్ లు పెడుతుంటే సామాన్య మహిళ పరిస్థితి ఏంటో ముఖ్యమంత్రి జగన్ ఆలోచించాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని సూచించారు.
తనకు పదవుల మీద ఆశలేదని తన తండ్రి కింజరాపు ఎర్రంనాయుడు, తన మామ ఎన్నో పదవులు పొందారని, తన తండ్రి ఆశయాల సాధన కోసం రాజకీయాల్లోకి వచ్చానన్నారు ఆదిరెడ్డి భవాని. తన పై పోస్ట్ లు పెట్టిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. భవాని మాట్లాడుతున్న సమయంలో సభ మొత్తం గంభీరంగా మారిపోయింది.