అర్థరాత్రి డబీర్ పురా పోలీస్ స్టేషన్ ముందు యాకుత్ పుర ఎంఐఎం ఎమ్మెల్యే అహ్మద్ పాషా ఖాద్రీ బైఠాయించి నిరసనకు దిగారు. ట్రాఫిక్ పోలీసుల తీరుకు నిరసనగా ఆయన పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు. హైదరాబాద్ పాతబస్తీ మీర్ చౌక్ ట్రాఫిక్ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
పదే పదే చిరు వ్యాపారులు, వాహనదారులపై కేసు నమోదు చేస్తూ ట్రాఫిక్ పోలీసులు వేధిస్తున్నారని ఆరోపించారు. ట్రాఫిక్ పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే అహ్మద్ పాషా.
గత కొద్ది కాలంగా మీర్ చౌక్ ట్రాఫిక్ పోలీసులు వర్సెస్ ఎమ్మెల్యే అహ్మద్ పాషా ఖాద్రీ అన్నట్లు మారింది. ఇక్కడి వాహనదారులపై ట్రాఫిక్ పోలీసులు ఇష్టానుసారంగా ఫైన్ లు విధిస్తున్నారని.. కేసులు నమోదు చేస్తూ ఇబ్బంది పెడుతున్నారని గతంలోనే ఆరోపణలు చేశారు.
ట్రాఫిక్ ఆంక్షల పేరిట వేధిస్తున్నారని పలువురు ప్రజలు పాషా ఖాద్రీకి ఫిర్యాదులు అందినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పాషా ఖాద్రీ ట్రాఫిక్ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీస్ స్టేషన్ లో బైఠాయించారు.