ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించి టీడీపీకి ఓటు వేశారన్న ఆరోపణలపై అధికార వైసీపీ సస్పెండ్ చేసిన నలుగురు ఎమ్మెల్యేల్లో వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ఒకరు. వైసీపీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత మొదటి సారి ఆయన మీడియా ముందుకు వచ్చారు. తాజాగా ఆనం ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోలింగ్ మొత్తం రహస్యంగా జరుగుతుందని తెలిపారు. రహస్యంగా జరిగే పోలింగ్ లో నేను క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డట్లు సజ్జల రామకృష్ణారెడ్డికి ఎలా తెలిసిందని ఆనం ప్రశ్నించారు. సాధారణ జర్నలిస్టు అయిన సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడు కోట్లకు ఎలా పడగలెత్తారని ప్రశ్నించారు. సజ్జల ముందురోజు ప్రకటనకి, తర్వాత రోజు మాట్లాడినదానికి సంబంధం ఉందా? అంటూ ప్రశ్నించారు.
ఎన్నికల ముందురోజు సజ్జల మాట్లాడుతూ.. ఆనం రామనారాయణ రెడ్డి అనే అతను మా ఎమ్మెల్యేనే కాదు.. మేం అతడిని ఓటు అడగలేదని చెప్పారు. ఫలితాలు వచ్చిన తర్వాత రూ.20 కోట్లు తీసుకుని క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డానని నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నా ఓటే పరిగణలో లేనప్పుడు నేను ఎవరికి ఓటేస్తే మీకెందుకు? నా నియోజకవర్గంలో రాజ్యాంగేతర శక్తిని ఇన్ ఛార్జ్ గా నియమించారు.. అవినీతిని ప్రశ్నిస్తే సీఎం జగన్ స్వయంగా ఫోన్ చేసి అలా మాట్లాడొద్దన్నారంటూ ఆనం చెప్పారు. ప్రజాస్వామ్య విలువలు తెలియని వ్యక్తులతో కలిసి నాలుగేళ్ల కలిసి నడిచినందుకు బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు ఆనం రామనారాయణ రెడ్డి.