– దగ్గర పడుతున్న ఎలక్షన్స్
– బినామీల భూ విక్రయాలకు ప్లాన్స్
– అధ్యక్షా.. అనాలనేదే అందరి ఆరాటం
– నగదు బెంగతో ముందే బీఆర్ఎస్ అలర్ట్
– టికెట్ కోసం డబ్బులు కూడబెట్టుకుంటున్న ఆశావాహులు
– గతంతో పోలిస్తే భారీగా పెరుగుతున్న ఖర్చులు
– ఎంతైనా తగ్గేదేలేదంటున్న ఖద్దర్ చొక్కాలు
క్రైంబ్యూరో, తొలివెలుగు:
తెలంగాణలో పెట్టే ఎన్నికల ఖర్చుతో దేశంలోని సగం రాష్ట్రాల్లో గెలవొచ్చనే చర్చ ఉంది. ఇటీవల ఎమ్మెల్యేల ఎర కేసు వీడియో ద్వారా ఇది అందరికీ తెలిసింది. ఇప్పుడు అదే దిశగా అడుగులు పడుతున్నట్టు కనిపిస్తోంది. గతంలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత.. టికెట్ వచ్చాక అభ్యర్థులు ఆస్తులు అమ్ముకొని ఖర్చులు చేసేవారు. కానీ, ఇప్పుడు అలా కాదు. నగదు ఫ్లోటింగ్ ఉంటేనే టికెట్ ఇస్తామనే విధంగా పార్టీలు మారాయి.
దీంతో ఆశావాహులు ముందే పెద్దఎత్తున వారి వ్యవసాయ భూములు, పెట్టుబడి పెట్టుకున్న ఆస్తులను అగ్రిమెంట్లు చేసుకుంటున్నారు. ఈ మేరకు బడా వ్యాపార వేత్తలను సంప్రదిస్తున్నారు. వందల ఎకరాలు ఉన్నాయి బల్క్ అమౌంట్ ఇచ్చేవారు కావాలని తిరుగుతున్నారు. ఏదైనా లిటిగేషన్ ఉన్నా రాజీ కుదుర్చుకుని మరీ అమ్మకాలు చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి అధికారులు పూర్తిగా సహకరిస్తున్నట్టు అంతా చర్చించుకుంటున్నారు. బినామీల సంపదపై ఎలాంటి లెక్కలూ తీయకుండానే అన్నీ చకచకా చేసేస్తున్నారని తెలుస్తోంది.
వరంగల్ లో ఇలా అమ్మకానికి పెట్టారు!
వరంగల్ లో కాంగ్రెస్ అంతా తనదే అని చెప్పుకునే నేత.. ఒకప్పటి మంత్రి.. ఇప్పటికే నగర శివార్లలో తాను ఇష్టంగా నిర్మించుకున్న మందిరం పక్కనే ఉన్న రూ.100 కోట్ల విలువైన భూమిని అమ్మి క్యాష్ చేసుకున్నట్లు చర్చ జరుగుతోంది. అధికార పార్టీకి చెందిన ఎస్సీ నియోజకవర్గ ఎమ్మెల్యే గతంలో బంపర్ మెజార్టీతో గెలిచి రెండు చేతులా సంపాదించిన నేత ఇప్పుడు వరంగల్ రింగ్ రోడ్డు పక్కన బినామీ పేర్లతో ఉండే భూములను అమ్మే పనిలో పడ్డారు. సుమారు రూ.120 కోట్లు సర్దుబాటు చేసుకుంటున్నారు. కాజీపేట సమీపంలో కొద్ది రోజుల క్రితం మంత్రి కొనుగోలు చేసిన భూములను ఇప్పుడు ఆయన అమ్మాలనుకుంటున్నారు.
నర్సంపేట్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ లో ఉన్న నేత వరంగల్ సెంట్రల్ లైబ్రరీ సమీపంలోని పెద్ద ప్లాట్ ను అమ్మకానికి పెట్టారని సమాచారం. నిత్యం వివాదాల్లో ఉండే మరో ఎమ్మెల్యే హైదరాబాద్ రాజేంద్రనగర్ లోని తన తమ్ముని పేరిట ఉన్న భూమికి బయానా తీసుకున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ మహిళా ఎమ్మెల్యే తన కుమారుడి పేరు మీద ఉన్న భూమిని ఇప్పటికే అమ్మేశారు. వరంగల్ వెస్ట్ నుంచి బరిలో దిగేందుకు పోటీ పడుతున్న ప్రతిపక్ష నేతల్లో ఒకరు ఘట్ కేసర్ వద్ద వెంచర్స్ లోని ప్లాట్స్ ను అమ్మే పనిని స్పీడప్ చేశారు. మరొకరు వరంగల్ ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర 5 ఎకరాల భూమిని అమ్మకానికి పెట్టారు.
ఇంట్రెస్ట్ చూపిస్తున్న ఇతర రాష్ట్రాల నేతలు!
ఎన్నికలు లేని తమిళనాడు, మహారాష్ట్ర నుంచి భారీగా నేతలు రాయబారాలు చేస్తున్నారు. రోడ్డు సౌకర్యాలు ఉండటం, గత ఎన్నికల ముందు ధరలతో ప్రస్తుత ధరలను బేరీజు వేస్తే మళ్లీ పెరుగుతున్నాయని తెలిసి కొనుగోలు చేస్తున్నారు. అయితే.. డబ్బుల తరలింపు పైనే మల్లగుల్లాలు పడుతున్నట్లు సమాచారం.
అన్ని జిల్లాల్లోనూ అదే పరిస్థితి!
కేంద్ర ప్రభుత్వంతో బీఆర్ఎస్ పార్టీకి చెడటంతో అధికార పార్టీ నేతలకు గుబులు పట్టుకుంది. ఇప్పటికే ఆర్థికంగా బలహీనంగా ఉన్న ఎమ్మెల్యేలకు లోకల్ నేతల ఇండ్లకు డబ్బులు చేరాయని టాక్. ఎలక్షన్ టైంలో పరిస్థితి మరింత కఠినంగా ఉండబోతుందని తెలుస్తోంది. మరోవైపు బీజేపీ, కాంగ్రెస్ నేతలు డబ్బులు భారీగానే పంచేందుకు స్కెచ్ వేసుకోవడంతో బీఆర్ఎస్ అంతకు నాలుగంతలు రెడీ చేసుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది.. వివిధ జిల్లాల్లో ఎక్కడెక్కడ నేతలు భూములు అమ్మకానికి పెట్టారు, వాటికి ఎలాంటి రేట్లు పలుకుతున్నాయో.. త్వరలో మరిన్ని కథనాలు మీ ముందు ఉంచబోతోంది తొలివెలుగు