వైసీపీ కీలక నేత, ఏపీ మాజీ మంత్రి, విశాఖ జిల్లా భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్.. ఓ ఎస్ఐ తోపాటు.. మరో మీడియా ప్రతినిధిని బెదిరించిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
భీమిలి పరిధిలోని పద్మనాభం మండలం కోరాడలో సోమవారం రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి అధికార పార్టీ ఎమ్మెల్యేగా అవంతి హాజరయ్యారు. కార్యక్రమంలో పాల్గొన్న మీడియా ప్రతినిధులతో పాటు.. పోలీసు సిబ్బందిపైనా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
డ్యూటీలో ఉన్న ఓ ఎస్సైని పట్టుకుని ఏయ్ ఎస్సై ఏం చేస్తున్నావనయ్యా.. ఇందుకేనా నీకు జీతం ఇచ్చేది అం ఆగ్రహంతో ఊగిపోయారు. ఆ తర్వాత కార్యక్రమాన్ని కవర్ చేసేందుకు వచ్చిన ఓ మీడియా ప్రతినిధిని.. నీ సంగతి చూస్తానంటూ వేలు చూపించి మరీ బెదిరించారు.
అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ విడియో చూసిని నెటిజన్లు ఎమ్మెల్యే వ్యవహారంపై మండిపడుతున్నారు. అధికారం ఉందని ఊగిపోవడం నాయకుని లక్షణం కాదని కామెంట్లు పెడుతున్నారు.