మాజీ పార్లమెంట్ సభ్యుడు బూర నర్సయ్య గౌడ్ రాజీనామాపై ఎమ్మెల్యే బాల్క సుమన్ స్పందించారు. మునుగోడు ఎన్నికల ప్రచారంలో భాగంగా చండూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బూర చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. మనసులో ఏదో పెట్టుకుని అడ్డగోలుగా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. బూర నర్సయ్య గౌడ్ కు టీఆర్ఎస్ పార్టీ అన్ని రకాలుగా అవకాశాలు కల్పించిందని అన్నారు. బూర నర్సయ్య గౌడ్ వ్యవహారం చూస్తుంటే.. తిన్నింటి వాసాలు లెక్కబెడుతున్నట్లు ఉందని బాల్క సుమన్ ఫైర్ అయ్యారు.
కేసీఆర్ పై విమర్శలు చేయడమంటే సూర్యుడిపై ఉమ్మి వేసినట్లేనని అన్నారు. ఆత్మ గౌరవం అంటునే ఢిల్లీలో రెండు రోజులు బీజేపీ నాయకుల అపాయింట్ మెంట్ కోసం పడిగాపులు కాసిన బూర.. గౌరవం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. చిలక పలుకులు పలుకుతున్న బూర నర్సయ్య గౌడ్ ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఆయన సూచించారు.
2014, 2018 ఎన్నికల్లో బూర నర్సకు టీఆర్ఎస్ పార్టీ అవకాశాలు కల్పించిదన్నారు. టీఆర్ఎస్ పార్టీని విమర్శించే అర్హత బూరకు లేదని, రాజీనామా లేఖలో పేర్కొన్న అంశాల్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని బాల్క సుమన్ డిమాండ్ చేశారు. టీఆర్‌ఎస్ అధిష్టానం బూర నర్సయ్యగౌడ్‌కు రెండు సార్లు ఎంపీగా అవకాశం కల్పించిందని గుర్తు చేశారు. కేంద్రంలో బీసీ శాఖ పెట్టకుండా మోసం చేస్తున్న బీజేపీలోకి వెళ్లి నీతులు చెప్తున్నాడని ఎద్దేవా చేశారు.
బలహీన వర్గాలను మోసం చేసేలా బూర నర్సయ్య గౌడ్ వ్యాఖ్యలు ఉన్నాయని ఆరోపించారు. తక్షణమే వ్యాఖ్యలు వెనుకకు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలను అక్కున చేర్చుకుని వారికి అన్ని విధాలా న్యాయం చేస్తున్నారని పేర్కొన్నారు. మునుగోడులో గులాబీ జెండా ఎగరడం ఖామయన్నారు బాల్క సుమన్. కేటీఆర్ రోడ్ షో తర్వాత పార్టీ క్యాడర్ లో జోష్ మరింత పెరిగిందన్నారు ఎమ్మెల్యే బాల్క సుమన్.