– నడిరోడ్డుపై పసికందును చంపేశారు
– 2 నెలల బాలుడిని చంపిన ఎమ్మెల్యే కారు
– డ్రైవింగ్ సీటులో ఎమ్మెల్యే షకీల్ కొడుకు ఉన్నాడా?
– ప్రమాదం చేసిందెవరు..? అరెస్ట్ చేసిందెవరిని?
– సీసీ ఫుటేజ్ లేదని..నిందితులను తప్పించే యత్నం!
– వీవీఐపీల నిర్లక్ష్యానికి ఎన్నిప్రాణాలు పోవాలి?
– విధ్వంసం సృష్టిస్తున్న కార్లను పట్టించుకోని ఖాకీలు
– బ్లాక్ స్టిక్కర్,టీఆర్ నెంబర్ తో దందా..?
తొలివెలుగు క్రైంబ్యూరో, హైదరాబాద్ : బోధన్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ స్టిక్కర్ తో ఉన్నకారు ఓ పసికందుప్రాణాన్ని బలి తీసుకుంది. ఇది వీవీఐపీ కార్ల రిజిస్ట్రేషన్ లోపాలు, టీఆర్ నెంబర్ ప్లేట్లతో జరుగుతున్నదారుణాలను మరోసారి తెరపైకి తెచ్చింది. అటు..ఈ కారు ప్రమాదంతో పోలీసుల వైఫల్యం మరోసారి బయటపడింది.షకీల్ అధికార పార్టీ ఎమ్మెల్యే కావడంతో ప్రమాదం జరిగినప్పుడు కారులో ఉన్నది ఎవరు..?డ్రైవింగ్ చేసింది ఎవరు.? వంటి వివరాలన్నీ గోప్యంగా మారిపోయాయి. ఇక ప్రమాదంలో 2 నెలల బాలుడు చనిపోయాడని తెలుసుకున్న ఎమ్మెల్యే షకీల్.. గాయపడ్డవారికి తక్షణం చికిత్సఅందించాలని కోరినట్టు తెలిపారు. కాని పోలీసులకు మాత్రం సమాచారం ఇవ్వలేదు. మరోవైపు.. పోలీసులు 24 గంటలు వెతికినా యాక్సిడెంట్ చేసిన వ్యక్తి ఆచూకీ లేదు. కారణం..షకీల్ కుమారుడు డ్రైవింగ్ సీట్లో ఉన్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అందుకే సదరు నిందితుడిని తప్పించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది.
జూబ్లీహిల్స్ ప్రమాద సంఘటనలో ట్విస్ట్ !
ఇక ఈ యాక్సిడెంట్ లో ట్విస్ట్ ఏంటంటే.. జూబ్లీహిల్స్ లాంటి ప్రాంతంలో ఆ కారు వెళ్లిన మార్గం అంతా జల్లెడ పడితే సీసీ ఫుటేజ్ లో ఎక్కడో ఒక దగ్గర నిందితుడుని కచ్చితంగా పట్టుకోవచ్చు. కానీ… హైటెక్ పోలీసులకు మాత్రం అది సాధ్యం కావటం లేదట. దీనికి తోడు .. ఉన్నట్టుండి అకస్మాత్తుగా నిందితుడిని పట్టుకున్నామంటూ మీర్జా అనే వ్యక్తిని తెరపైకి తీసుకొచ్చారు. అటు కారు తరఫున వచ్చిన షకీల్ అనుచరులు బాధితులతో మాట్లాడి.. వైద్యం ఖర్చులకని రెండు లక్షల రూపాయలిచ్చి వాళ్ల సొంతూరుకు అంటే మహారాష్ట్రకు పంపించినట్టు సమాచారం. నిమ్స్ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన బాధితురాలు కాజల్ చౌహాన్,కుటుంబ సభ్యులు, మృత శిశువును తీసుకొని సొంతూరుకు బయలుదేరింది.తనకు హైదరాబాద్ లో సాయం చేయటానికి ఎవ్వరూ లేనందున సొంతూరుకు వెళ్తున్నట్టు చెప్పిందని సమాచారం.
ఈ ఘటన మాత్రమే కాదు..ఇలా హైదరాబాద్ లో, మరీ ప్రత్యేకించి జూబ్లీహిల్స్,బంజారాహిల్స్ వంటి ప్రాంతాల్లో వీవీఐపీలు, సెలబ్రిటీల కార్లు ప్రాణాంతకంగా మారాయి. అడుగడుగునా సీసీ కెమెరాలు పెట్టించామని ప్రభుత్వాలు గొప్పలు చెప్పుకోవటమే గానీ.. ఇంత హైటెక్ రోజుల్లో మన పోలీసులు మాత్రం యాక్సిడెంట్ జరిగి రోజు గడిచినా సీసీ ఫుటేజ్ జల్లెడ పట్టే పనిలోనే ఉంటారు. అంతేనా.. వీవీఐపీల రక్షణే ధ్యేయంగా పనిచేస్తారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
షకీల్ కారు…అంతా ఉల్లంఘనే !
రిజిస్ట్రేషన్ కాని కారు ఎలా ఉండాలి…! ప్రమాదం జరిపిన కారు..షోరూం నుంచి వచ్చిన కారులాగా ఉందా..? పైగా 100 శాతం బ్లాక్ ఫ్రేమ్ తో గ్లాస్ లు చుట్టేశారు.రిజిస్ట్రేషన్ అయినా.. టీ.ఆర్.నెంబర్ తో బండి నడిపిస్తున్నారు. ఎందుకంటే..వీవీఐపీల కార్లు హత్యలు చేసినా..నేరాలకు పాల్పడ్డా దొరకకుండా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు.ఇలా ఒక్కరు కాదు ఎందరో నేతల కార్లు ఇలానే ఉన్నాయి. వారి వ్యవహారం చాలా దారుణంగా ఉంది. ఇలాంటి కార్లు, అడ్డగోలుగా నిబంధనలు ఉల్లంఘించే వ్యవహారాలపై ఎక్కడా చర్యలు తీసుకోవటం లేదని..తాజా ఘటన మరోసారి రుజువు చేసింది.
ఎమ్మెల్యే స్టిక్కర్..ఎవరికైనా ఇచ్చేస్తారా..?
గురువారం రాత్రి 8 గంటలకు ప్రమాదం జరిగింది.అప్పుడు ఎమ్మెల్యే షకిల్..అసలు తనకు సంబంధం లేదని ..స్టిక్కర్ అడిగితే ఇచ్చానని తెలిపారు. ఇలా ఎందరో బినామీలు ఎమ్మెల్యేల స్టిక్కర్లతో తిరుగుతున్నారు. కాని ఈ కారు మాత్రం తన కుటుంబానికి చెందిందని..అదికూడా శుక్రవారం తొలివెలుగు క్రైం బ్యూరో గ్రౌండ్ రిపోర్ట్ చేశాక..వీడియో విడుదల చేశారు. అప్పుడు..మీతో మాట్లాడిన నేరస్థులు..పోలీసులకు ఎందుకు చిక్కలేదని ప్రశ్నించింది తొలివెలుగు..నేరం ఎవ్వరు చేస్తే.. శిక్ష వారికే ఉండాలి …కాని అలా జరగడం లేదని అర్థమవుతోంది.
టీఆర్ఎస్..చెప్పేవి నీతులు..చేసేవి..?
చిన్నపాటి తప్పు చేసినా..కొడుకునైనా జైలుకు పంపిస్తా అన్న కేసియార్..తన పార్టీ నేతలంతా మోటర్ వెహికిల్ చట్టానికి తూట్లు పొడుస్తున్నా పట్టించుకోవటం లేదు. చిన్నగా కనిపించినా..పెద్ద పెద్ద తప్పిదాలు జరుగుతాయి.మొగ్గలోనే చట్టం పవరేంటో అందరికి తెలియాలి. కాని తప్పు చేసిన నేతలకు ఆ పాఠాలు నేర్పటం లేదు. పోలీస్ అధికారులకు ఫ్రీ హాండ్ ఇచ్చినా.. తప్పు చేసింది ఎవ్వరైనా.. కచ్చితంగా పట్టుకుని చట్టం పవరేంటో చూపిస్తారు. కానీ పరిస్థితులు అలా లేవు. ఒక్క అధికారిక స్టిక్కర్ ఉంటే చాలు.. ఎలాంటి ఉల్లంఘనలు అయినా చేయవచ్చని రెచ్చిపోతున్నారు నాయకులు. ఏ ఒక్కరి కారుకు సరైన నెంబర్ ప్లేట్ కనిపించదు. అంతేనా.. ప్రైవేట్ వాహనాలకు సైరన్స్ ఫిట్ చేయించుకుని మరీ అధికారం చెలాయిస్తున్నారు. త్వరలో.. వీటన్నింటి పై తొలివెలుగు క్రైం బ్యూరో పూర్తి కథనాలు ఇవ్వనుంది.