ప్రపంచమే కుగ్రామైన నేటి కాలంలో… రవాణా, వైద్య సౌకర్యాలు లేక అవస్థలు పడుతున్న ప్రజలను చూసి తలదించుకునేలా చేసిన ఘటన ఇది. దేశం వెలిగిపోతుందని, సబ్ కా సాత్ సబ్ కా వికాస్ అని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వాలు మెల్కొనేలా చేసే ఘటన ఇది. స్థానిక ప్రభుత్వాల పనితీరు ఎంత అద్వాన్నంగా ఉందో వెలెత్తి చూపుతూ… ఒడిస్సాలో వెలుగులోకి వచ్చిన ఉదంతం అందరినీ కలిచివేస్తోంది.
పురిటి నొప్పులతో భాదపడుతూ.. సరైన వైద్య సౌకర్యం అందుబాటులో లేక, పెద్దాసుపత్రికి వెళ్లేందుకు కనీసం సరైన రోడ్డు సౌకర్యం కూడా లేదు. దీంతో ఆ గర్భిణీని స్వయంగా ఎమ్మెల్యే డోలీలో మోసుకొని వెళ్లారు. ఒడిస్సా రాష్ట్రంలోని నవరంగపూర్ జిల్లా కుసుముగూడలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇలాంటి ఘటనలు ఇక్కడ కొత్తేమీ కాదని, తరచూ జరుగుతూనే ఉన్నాయి.
నిండు గర్భిణీకి పురిటి నొప్పులు మొదలవటంతో… చుట్టుపక్కల ఉన్న వారు మొదట అంబులెన్సుకు ఫోన్ చేశారు. కానీ రోడ్డు మార్గం లేకపోవటంతో రాలేమని సమాధానం చెప్పటంతో ఇక చేసేది లేక డోలీలో కూర్చోబెట్టారు. అదే సమయంలో ప్రజలను కలిసి వారి సమస్యలు తెలుసుకునేందుకు బీజేడీ డాబుగాం ఎమ్మెల్యే మనోహర రొంధారి తండాల్లో పర్యటిస్తున్నారు. పరిస్థితిని చూసిన ఎమ్మెల్యే డోలిలో మహిళను మోసుకుని వెళ్ళాడు.
రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితులు ఉన్నాయని, రోడ్డు నిర్మాణం కోసం ప్రయత్నాలు చేసినప్పటికీ మావోయిస్టు ప్రాంతాల్లో పనుల్లో ఆగిపోతున్నాయని తెలిపారు. గతంలో ఓ మహిళను 30 కిలోమీటర్ల మేర స్టెచ్చర్ పై మోసుకుని వెళ్లిన ఘటనలు చోటు చేసుకున్నాయి.