రికార్డు స్థాయి కేసులతో తెలంగాణ ఓ వైపు కరోనా కోరల్లో చిక్కుకుని విలవిలలాడుతుంటే.. మరోవైపు సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి, వారి అధినేతే ఈమహమ్మారి బారినపడి పోరాడుతోంటే.. అధికార పార్టీ నేతలకు మాత్రం అదేం పట్టకుండాపోయింది. ఎవరికి ఏం అయితే తమకేంటి అనుకున్నారేమో.. ఆ ఎమ్మెల్యే ఇంట జబర్దస్త్‌గా జల్సాల్లో మునిగితేలారు. కనీసం కర్ఫ్యూ ఉందన్న విషయం కూడా మరిచిపోయి, రాత్రి పూట బర్త్ డే పార్టీ చేసుకుని తెగ ఎంజాయ్ చేశారు.
ఇదిగో ఈ వీడియో చూశారా.. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పుట్టిన రోజు వేడుకలివి. కరోనా ఉంది కదా ఏదో సాదాసీదాగా నిర్వహించారనుకుంటే పొరపాటే. మంత్రి జగదీష్ రెడ్డి, రాజ్య సభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, ఆ పార్టీ నేత తక్కెళ్ల పల్లి రవీందర్ రావు.. ఇలా భారీ బలగమే ఈ కార్యక్రమానికి దిగిపోయింది. పోని వారు మాత్రమే వచ్చారా అనుకుంటే.. అదీ కాదూ..వారి వారి అనుచరులతో గుంపులు గుంపులుగా వచ్చి.. వేడుకల్లో పాల్గొని.. కరోనా వేళ జనానికి కొత్త సందేశం ఇచ్చారు.
ఆల్‌రెడీ ఉమ్మడి నల్గొండ జిల్లాలో కరోనా తీవ్రత చాలా ఉంది. ముఖ్యమంత్రికి ఇక్కడే సోకిందని నిర్ధారణకు కూడా వచ్చారు. కానీ ఆ సోయి కూడా లేకుండా చిరుమర్తి లింగయ్య.. బర్త్‌డే సంబరాలు చేసుకోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బయట జనం కరోనాతో చస్తుంటే.. కనీసం ప్రజాప్రతినిధులం అన్న విషయాన్ని కూడా మరిచిపోయి ఇలా వేడుకలు చేసుకోవడం ఏంటని జనం మండిపడుతున్నారు. కనీసం కేసీఆర్‌కు కరోనా సోకిందన్న బాధతో అయినా.. వేడుక చేసుకోవద్దని ఎమ్మెల్యేకు, హాజరుకావొద్దని మంత్రి, ఇతర నేతలకు విజ్ఞత లేకుండా పోయిందా అని కామెంట్లు చేస్తున్నారు.
ఇంత పెద్ద పార్టీ చేసుకున్న ఇదే చిరుమర్తి లింగయ్య..కరోనా పరిస్థితుల దృష్ట్యా తనను కలిసేందుకు ఎవరు రావొద్దని, కేసీఆర్ త్వరగా వైరస్ బారి నుంచి కోలుకోవాలని ప్రార్ధిద్దామంటూ ఉదయం పార్టీ శ్రేణులకు సందేశం పంపడం కొసమెరుపు.