తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గవర్నర్ పులి తీరుగా బయట గాండ్రించారని, కానీ పిల్లి తీరుగా సభలో ప్రసంగించారని వ్యాఖ్యానించారు. గత్యంతరం లేకే గవర్నర్ మాట్లాడారన్నారు. గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, తెలంగాణ సీఎం కేసీఆర్ మధ్య రాజీ కుదిరిందని ఆరోపణలు చేశారు.
బీజేపీకి బీ టీంగా బీఆర్ఎస్ మారిపోయిందని ఎద్దేవా చేశారు. గవర్నర్ పెద్ద పెద్ద మాటలు చెప్పి.. ప్రసంగంలో తుస్ మనిపించారని సెటైర్లు వేశారు. ఇది ఎన్నికల ఇయర్ అని, అసెంబ్లీలో మాట్లాడటానికి ఎన్నో సమస్యలు ఉన్నాయన్నారు.
సంగారెడ్డి సమస్యలతో పాటు రాష్ట్ర సమస్యలపై కూడా మాట్లాడతానన్నారు. మెట్రో ట్రైన్ పఠాన్ చెరు నుండి సంగారెడ్డి సదాశివ పేట వరకూ పొడిగించాలని అన్నారు. యాదగిరి గుట్ట వరకు మెట్రో విస్తరించాలన్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్నారు.
అంగన్ వాడి, వీఆర్వో, ఐకేపీ ఉద్యోగులు, సర్పంచుల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. గ్రామాల్లో ఆర్ఎంపీ వైద్యులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన తర్వాత పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే జీవో రద్దు చేశారని వ్యాఖ్యానించారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి.