రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో టీఆర్ఎస్ పార్టీ విలువలు పొగొట్టుకుందని విమర్శించారు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. హెటిరో సంస్థకు చెందిన పార్థసారథిని రాజ్యసభకు ఎందుకు ఎంపిక చేశారనేది ప్రశ్నార్థకంగా మారిందని అన్నారు. ప్రజాపరిపాలన పోయి.. బిజినెస్ పాలన నడుస్తోందనడానికి ఇదే నిదర్శనమని విరుచుకుపడ్డారు.
తెలంగాణ ఉద్యమంలో ఆత్మహత్య చేసుకున్న అమరుల కుటుంబాలకు.. రాజ్యసభ సీటు ఇవ్వొచ్చు కదా అని ప్రశ్నించారు జగ్గారెడ్డి. గతంలో ఐటీ రైడ్స్‌లో 500కోట్లతో పట్టుబడిన వ్యక్తికి రాజ్యసభ సీటు ఇవ్వడం వెనక ఉన్న అంతర్యం ఏమిటని నిలదీశారు.
కేసీఆర్ ఢిల్లీకి వెళ్తుంటే.. మోడీ హైదరాబాద్ వస్తున్నారని.. అసలు ఇదేమి రాజకీయమో అర్ధం కావడం లేదని విమర్శించారు. గతంలో దివంగత సీఎం ఎన్టీఆర్ కూడా ఇందీరా గాంధీకి స్వాగతం పలికారని.. కానీ ప్రధాని మోడీ హైదరాబాద్ కు వస్తే సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్తున్నారని వ్యాఖ్యానించారు.
మోడీ హైదరాబాద్ వచ్చే సమయంలో అసలు సీఎం ఢిల్లీకి ఎందుకెళ్తున్నారని.. పీఎం హదరాబాద్ లో ఉంటే కేసీఆర్ కు ఢిల్లీలో ఏం పని అని నిలదీశారు. మెదక్ లో పోటీ చేసే దమ్ము అసదుద్దీన్ ఓవైసీకి ఉందా అని ప్రశ్నించారు జగ్గారెడ్డి.