వక్ఫ్ బోర్డ్ భూములంటూ అన్యాయంగా తమ భూముల రిజిస్ట్రేషన్, అనుమతులను నిలిపివేయడాన్ని నిరసిస్తూ బోడుప్పల్ లో వక్ఫ్ బాధితులు ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ఆమరణ దీక్ష చేపట్టారు. బాధితులకు సంగీభావం ప్రకటించి దీక్షలో పాల్గొన్నారు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 40 ఏళ్ల నుండి నివాసం ఉంటున్న 7,000 మంది కుటుంబాల రిజిస్ట్రేషన్ లు ఆపడం దుర్మార్గమన్నారు.
నాలుగేళ్ల నుండి ఎంఐఎం నాయకులను సంతోష పెట్టడం కోసం కేసీఆర్ ఇంత మంది ప్రజలను ఇబ్బందులు పెట్టడం అన్యాయమన్నారు జగ్గారెడ్డి. హెచ్ఎండీఏ పరిధిలోని లేఔట్లు, ఘట్ కేసర్, బోడుప్పల్ పరిసరాల్లోని 28 కాలనీల పట్టా భూములను వక్ఫ్ బోర్డ్ భూములనడం న్యాయమేనా? అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వ నిర్ణయంతో వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. 2018 నుండి అత్యవసరాలకు కొనుగోలు, అమ్మకాలు, రిజిస్ట్రేషన్లు లేకుండా ఇబ్బంది పెడుతున్నారని దుయ్యబట్టారు.
ఈ సమస్యపై ముఖ్యమంత్రికి లేఖ రాస్తానని జగ్గారెడ్డి తెలిపారు. 40 ఏళ్లలో లేని సమస్యను నాలుగేళ్లలో ఎందుకు తీసుకొచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. కాలనీవాసులను ఇబ్బందులకు గురి చేసే చర్యలను వెనక్కి తీసుకోవాల్నారు. తక్షణం రిజిస్ట్రేషన్లు అయ్యే విధంగా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఏడు వేల కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని పేర్కొన్నారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి.
మాజీ రాజ్యసభ సభ్యులు వీ హనుమంత రావు మాట్లాడుతూ.. 40 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో వ్యవసాయం చేసుకునేవారని తెలిపారు. తాత ముత్తాతల నుండి అందరికీ పట్టా కాగితాలు ఉన్నాయన్నారు. ఈ ప్రాంత ప్రజలు ఇంటి పన్ను, వివిధ పన్నులు కూడా కడుతున్నారని గుర్తు చేశారు. ప్రభుత్వాల నుండి కూడా అన్ని సహాయ సహకారాలు వీరికి అంతుతున్నాయని తెలిపారు. అత్యవసరాలకు ఆస్తులు అమ్ముకుంటానంటే అడ్డుకోవడం దుర్మార్గమని మండిపడ్డారు. కొత్తగా ఇప్పుడు వక్ఫ్ భూములనడం, రిజిస్ట్రేషన్ లుఆపడం మంచిది కాదన్నారు వీహెచ్.