తెలంగాణ బీజేపీ నేతలపై కీలక వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై రాష్ట్ర బీజేపీ నేతలు అసంతృప్తితో ఉన్నట్టున్నారని ఎద్దేవా చేశారు. తనకు కాంగ్రెస్ చరిత్ర కంటే.. బీజేపీ చరిత్ర ఎక్కువగా తెలుసని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జగ్గారెడ్డి.
బీజేపీ ఎన్ని గేమ్స్ ఆడినా తెలంగాణలో అధికారంలోకి రావడం అసాధ్యమన్నారు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గవర్నర్ తమిళిసైను మార్చే అవకాశాలు కూడా ఉన్నాయని అన్నారు.
అసెంబ్లీకి సమావేశాలకు ముందు బీఆర్ఎస్ సర్కార్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన గవర్నర్ ఒక్కసారిగా సైలెంట్ అయ్యారని తెలిపారు. పులి తీరుగా బయట గాండ్రిచారని.. కానీ పిల్లి తీరుగా సభలో ప్రసంగించారని దుయ్యబట్టారు.
గత్యంతరం లేకే గవర్నర్ మాట్లాడారని చొప్పుకొచ్చారు. గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ ల మధ్య రాజీ కుదిరిందని అన్నారు. బీజేపీకి బీ టీమ్ గా బీఆర్ఎస్ మారిందని ఆరోపించారు జగ్గారెడ్డి.