రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డిపై సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నాగిరెడ్డి లాంటి అధికారులు మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. ఎన్నికల కమిషనర్ టీఆరెస్ కార్యకర్తగా వ్యవహరిస్తున్నారని జగ్గారెడ్డి ఆరోపించారు. ఓటర్ల జాబితా ప్రకటించకుండానే మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ ఎలా ఇస్తారని…షెడ్యూల్ ప్రకటించక ముందే టీఆరెస్ కార్యకర్తల ఫేస్ బుక్ లోకి ఎలా వచ్చిందని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర విభజనకు ముందు ఎన్నికల కమిషన్ అంటే ఒక నమ్మకం, గౌరవం ఉండేదని…ఎప్పుడైతే విభజన జరిగిందో నాటి నుంచే అవి పోయాయన్నారు. ఎన్నికల కమిషన్ ఓటర్లను దృష్టిలో పెట్టుకొని ఎన్నికల కసరత్తు చేయాలని..అయితే ఇప్పుడున్న కమిషనర్ ముఖ్యమంత్రి ఆధీనంలో పనిచేస్తున్నారని ఆరోపించారు. టీఆరెస్ ను ఎన్నిక కమిషన్, పోలీస్ శాఖలే కాపాడుతున్నాయని అన్నారు. ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని తెలిపారు.