తెలంగాణ రాష్ట్రంలో స్వయంగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీకే విలువ లేకుండా పోయిందని ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక సంగారెడ్డికి రావాల్సిన మెడికల్ కాలేజ్‌ని సిద్దిపేటకు తరలించారన్నారు. 2018 ఎన్నికల ప్రచారసభలో సంగారెడ్డికి మెడికల్ కాలేజ్ ఇస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని, శాసనసభలో కూడా ప్రకటించారన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం నుండి ఇప్పటికే ప్రతిపాదనలు వెళ్లినా… ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవటం లేదని జగ్గారెడ్డి మండిపడ్డారు. సీఎం ఇటీవల ఢిల్లీ పర్యటించినా, మెడికల్ కాలేజీ ప్రస్తావన తీసుకరాలేదన్నారు. 2021లోనైనా మెడికల్ కాలేజ్ హామీని నెరవేర్చాలని ఆయన సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. తక్షణమే వెయ్యి కోట్లు విడుదల చేయాలని కోరారు.
మెడికల్ కాలేజీ శిలాఫలకం మీద తన పేరు లేకున్నా ఫర్వాలేదని, మెడికల్ కాలేజ్ మాత్రం ఇవ్వాలన్నారు. జనవరి వరకు కాలేజ్ ఇవ్వకపోతే ఫిబ్రవరి నుంచి పోరాటం చేస్తానన్నారు. కాలేజ్ కోసం సీఎం కేసీఆర్ అపాయింట్ మెంట్ అడుగుతానని జగ్గారెడ్డి ప్రకటించారు.