రాష్ట్రంలో వీఆర్ఏల సమస్యలను పరిష్కరించి, వారికి దసరా కానుక ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఎమ్మెల్యే జగ్గారెడ్డి కోరారు. వీఆర్ఏ డిమాండ్స్ ను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలన్నారు. వారి పే స్కేల్ ను ప్రభుత్వం పెంచాలన్నారు.
వీఆర్ఏలకు ప్రమోషన్స్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. వాళ్ల వారసులకు ఉద్యోగాలకు జీవోలు ఇవ్వాలన్నారు. గత మూడు నెలలుగా వీఆర్ఏలు ఆందోళన చేస్తున్నారని పేర్కొన్నారు. కానీ వారి ఆందోళనలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.
వారికి మూడు నెలలుగా జీతాలు లేవన్నారు. ఒత్తిడికి తట్టుకోలేక ఇప్పటికే 28 మందికి పైగా వీఆర్ఏలు మరణించారన్నారు. వారిలో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిపారు. అనేక మంది వీఆర్ఏలు ఆత్మహత్య ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిపారు.
ఈ రాష్ట్రానికి కేసీఆర్ సీఎం అన్నారు. అందువల్ల ఆయనక కోపం తగదన్నారు. సీఎం అంటే తండ్రి లాంటి పదవన్నారు. ఒకసారి కోపం వచ్చినా పిల్లల ను మళ్ళీ దగ్గరికి తీసుకోవాలన్నారు. గ్రామాల్లో వీఆర్ఏలపై ఉన్నత అధికారులు పని భారం వేస్తున్నట్టు పేర్కొన్నారు. దీని వల్ల వీఆర్ఏలపై ఒత్తిడి పెరుగుతోందన్నారు.
దీంతో వారు ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. సంగారెడ్డి నియోజకవర్గంలో సుమారు 250 మంది వీఆర్ఏలు ఉన్నారన్నారు. వారందరితో తాను నేరుగా మాట్లాడినట్టు చెప్పారు. వారి స్థితిగతులను చూసి తెలుసుకున్నట్టు చెప్పారు.