బీఆర్ఎస్ పెడితే బీజేపీ నేతల లాగులు తడుస్తున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే జోగు రామన్న. ఈ సందర్భంగా ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ నేతలపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఏక్ నెంబర్ బామ్టే.. ఆదిలాబాద్ లో సాత్ నెంబర్ బామ్టే లున్నారన్నారు. అప్పులు చేసైనా మేము అభివృద్ధి పనులు చేశాము.. మీరు చేశారా? అంటూ ప్రశ్నించారు. సొమ్ము మాది అయితే మీవి సోకులు అంటూ సెటైర్లు వేశారు. 8 మంది ప్రధాన మంత్రులు చేసిన దానికంటే ఎక్కువ అప్పులు ఒక్క మోడీ చేశాడన్నారు.
రాష్ట్రంకు రావాల్సిన నిధుల విషయంలో కేటీఆర్ సవాల్ విసిరితే.. బీజేపీ నేతలు స్పందించలేదని ఎద్దేవా చేశారు. మోడీ ప్రభుత్వం 9 ఏళ్లలో ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని ఆరోపించారు. ప్రతీ వ్యక్తి మీద లక్షన్నర అప్పు పెట్టారని వ్యాఖ్యానించారు. సిలిండర్ ధర పెంచారని, ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు అని యువతను మోసం చేశారన్నారు. బీఆర్ఎస్ పెడితే బీజేపీ నేతల లాగులు తడుస్తున్నాయన్నారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ కోసం రాజీనామా చేయమంటే పారి పోయావ్ అంటూ ఎద్దేవా చేశారు. జై శ్రీరామ్ అంటే సరిపోదు.. జై శ్రీరామ్ అని ఉద్యోగాలు ఇవ్వకపోతే ఊరుకుంటారా? అంటూ విమర్శించారు. పొద్దు పొడిస్తే అబద్ధాలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.
భూములు కబ్జాలు చేసే మనిషి బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ అంటూ ఆరోపించారు. ఇంకో బీజేపీ నేత ఆదిలాబాద్ కేఏ పాల్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కబ్జాలు చేసే లీడర్లు కావాలో? లేక జనం కోసం సేవ చేసే నాయకులు కావాలో తేల్చుకోవాలని వెల్లడించారు ఎమ్మెల్యే జోగు రామన్న.