ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని నిధుల కోసం అర్థించినా, అభ్యర్థించినా ప్రయోజనం లేదని.. అందుకే ప్రశ్నించానని అన్నారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. శుక్రవారం కోటంరెడ్డి ఆధ్వర్యంలో ముస్లిం మైనార్టీల నిరసన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీ సర్కార్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
సమస్యల గురించి గట్టిగా మాట్లాడుతున్నానని నన్ను అవమానించారన్నారు. ఫోన్ ట్యాపింగ్ చేసి ఆవేదనకు గురి చేశారన్నారు. నిధుల కోసం అర్థించినా, అభ్యర్థించినా ప్రయోజనం లేదన్నారు. అందుకే ప్రభుత్వాన్ని ప్రశ్నించానని తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించకపోతే కోర్టును ఆశ్రయిస్తానని హెచ్చరించారు.
నెల్లూరు రూరల్ లో మైనార్టీల అభివృద్ధికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయలేదని ఆరోపించారు. బారా షాహిద్ దర్గా అభివృద్ధికి రూ.13 కోట్లకు సీఎం జగన్ ఆమోదం తెలిపినా, ఆర్థిక శాఖ నిధులు విడుదల చేయలేదని విమర్శించారు.
నిధులు ఎప్పుడు అడిగినా లేవనే చెబుతున్నారని మండిపడ్డారు. ఒక ప్రభుత్వం చేసిన పనిని మరో ప్రభుత్వం అడ్డుకోవడం సరికాదన్నారు. టిడ్కో ఇళ్ల విషయంలో కూడా ఇదే జరిగిందన్నారు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.