ప్రభుత్వ సలహాదరు సజ్జల రామకృష్ణారెడ్డిపై వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నగర వైసీపీ అధ్యక్షుడు తాటి వెంకటేశ్వర రావుతో పాటు రఘు, జావేద్ లను పోలీసులు అరెస్ట్ చేశారన్నారు. షాడో ముఖ్యమంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి ఆదేశాల మేరకే ఈ అరెస్టులు జరుగుతున్నాయన్నారు.
ఆంధ్ర ప్రదేశ్ లోని మిగతా అన్ని అంశాలను వదిలి షాడో ముఖ్యమంత్రి నెల్లూరు రూరల్ పై దృష్టి పెట్టారని ఎద్దేవా చేశారు. అరెస్ట్ లపై పోలీసులు సరైన సమాచారం ఇవ్వలేదని మండిపడ్డారు. నేను వేదాయపాలెం పోలీస్ స్టేషన్ కు వెళ్లగా అక్కడ వెంకటేశ్వర రావు లేకపోవడంతో పోలీసులను నిలదీశానన్నారు. 24 గంటల్లో న్యాయస్థానంలో ప్రవేశపెడతామని డీఎస్పీ హామీ ఇవ్వడంతో నిరసన విరమించినట్లు ఆయన చెప్పారు.
ఏదిఏమైనా నేతలను అరెస్ట్ చేసిన తీరు ఇదికాదన్నారు. హైవేపై రాత్రి 11:30 గంటల వరకూ తిప్పారని.. పిస్టల్ అటూ ఇటూ తిప్పుతూ బెదిరించాలని చూశారని చెప్పారు. ఇలాంటివి చిన్నప్పుడు వీఆర్ హైస్కూల్ లో చూశామంటూ సెటైర్లు వేశారు. నన్ను మానసికంగా వేధించాలని చూస్తున్నారు.
కానీ నా అనుచరులు ఎవరూ భయపడరు.. కనీసం నా డ్రైవర్ కూడా పట్టించుకోడని సీరియస్ అయ్యారు. నాలుగు నెలల క్రితం జరిగిన ఘటన ఇది. అప్పుడు ఇది కేసు కాదు.. కీనా ఇప్పుడు మాత్రం కేసు ఎందుకు? అని ప్రశ్నించారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.