తనపై శివచరణ్ రెడ్డి చేస్తున్న ఆరోపణలపై ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి స్పందించారు. శివచరణ్ రెడ్డి చేసిన ఆరోపణల్లో ఎలాంటి వాస్తవమూ లేదని ఆయన పేర్కొన్నారు. ఇదంతా పెద్ద బోగస్ అంటూ ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఓ వీడియో కూడా విడుదల చేశారు.
తనకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారని చెప్పారు. పెద్ద కుమార్తె లక్ష్మీ రచనారెడ్డి, చిన్న కుమార్తె సాయిప్రేమితా రెడ్డి అని ఆయన పేర్కొన్నారు. శివచరణ్ రెడ్డి తండ్రి వెంకట కొండారెడ్డి అని ఆయన అన్నారు. శివచరణ్ రెడ్డి, అతని తల్లి కలిసి తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని వెల్లడించారు.
ఇలాంటి ఆరోపణలు చేయడం సరికాదన్నారు. రాజకీయంగా తనను నేరుగా ఎదుర్కోవాలని ఆయన సూచించారు. అంతే కాని ఇలా డొంక తిరుగుడు మనుషులు, గాలి మనుషులతో ఇలాంటి ఆరోపణలు చేయించడం సరిగా లేదన్నారు. వ్యక్తిగతంగా తనపై బురద జల్లితే ఆ దేవుడు కూడా క్షమించడని ఆయన అన్నారు.
శాంతికుమారితో అనుబంధంపై కూడా ఆయన వివరణ ఇచ్చారు. శాంతికుమారి తన భార్య అని ఆయన అన్నారు. 29 ఏండ్ల క్రితం ఆమెతో తనకు అనుబంధం ఏర్పడిందన్నారు. సాయి ప్రేమితారెడ్డి తమకు కలిగిన సంతానమని పేర్కొన్నారు. తన ఆరోగ్యం, రాజకీయం రీత్యా తనకు ఆమె తోడుగా ఉంటుందని, తన పనుల్లో సహాయం చేస్తోందని వెల్లడించారు.