యధా రాజా తధా ప్రజ అన్నట్టుంది టీఆర్ఎస్ నేతల వ్యవహారం. గులాబీ పార్టీలో గురువులు ఎలా ఉన్నారో శిష్యులూ అలాగే తయారవుతున్నారు. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డిపై వచ్చిన భూకబ్జా ఆరోపణలు లెక్కలేనన్ని. ఏకంగా చెరువునే మింగేయబోగా..ఈ ఎమ్మెల్యేపై జనం తిరగబడ్డారు అప్పట్లో. అయితే ముత్తిరెడ్డి వెంట తిరిగే ఆయన అనుచరులకూ అవే అవలక్షణాలు వచ్చినట్టున్నాయంటున్నారు కొమురవెల్లి వాసులు. గురువు చెరువును మింగేయబోతే.. ఆయన శిష్యుడు ఏకంగా స్మశానాన్నే కబ్జాచేస్తున్నాడని ఆరోపిస్తున్నారు.
కొమురవెల్లి గ్రామ శివారులోని సర్వే నెంబర్ 261లో వందల ఏళ్లుగా ముస్లింల స్మశానవాటిక కొనసాగుతోంది. నాలుగు తరాలుగా ఎవరు చనిపోయినా అక్కడే అంత్యక్రియలు జరుపుతున్నారు. ఇటీవల ప్రభుత్వం ఈ స్థలంలో స్మశాన వాటిక నిర్మించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు జూన్ 30న సిద్దిపేట అడిషనల్ కలెక్టర్ ముజామిల్ ఖాన్ పనులను కూడా ప్రారంభించారు. పనులు కొనసాగుతుండగా.. మధ్యలో ఎంట్రీ ఇచ్చాడు ముత్తిరెడ్డి అనుచరుడు, కొమురవెల్లి ఆలయ ట్రస్ట్ బోర్డు మెంబర్ ముత్యం నరసింహులు. స్మశాన వాటిక స్థలం తనదేనని.. చదును చేసేందుకు సిద్ధమయ్యాడు. దీంతో గ్రామస్తులు ఆ పనులను అడ్డుకుని అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు ఆ స్థలం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు.
అధికారులు ఆ స్థలం స్మశానవాటికదే అని నిర్ధారించిన తర్వాత కూడా.. ముత్యం నరసింహులు ఇంకా ఆ స్థలం తనదేనని వాదిస్తున్నాడు. ఆ పక్కనే తన భూమి ఉందని.. అది కూడా తనదేనంటూ అధికార బలంతో పనులను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. దీంతో గ్రామస్తులు భగ్గుమంటున్నారు. తమకు ఊహ తెలిసినప్పటి నుంచి ఆ స్థలం స్మశాన వాటికగానే ఉపయోగిస్తున్నారని.. ఇప్పుడు కొత్తగా నరసింహులు అది తనకే చెందాలని అనడంపై మండిపడుతున్నారు. జిల్లా కలెక్టర్ వెంటనే జోక్యం చేసుకుని.. అతనిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.