నోరు తెరిస్తే బూతులు మాట్లాడే టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లికి ఈ ‘గుడ్ కండక్ట్’ సర్టిఫికెట్ ఏమిటని షాక్ అవుతున్నారా? అందుకు పెద్ద కారణమే ఉంది. మైనంపల్లి ఏం చేసినా, ఏం మాట్లాడినా రాముడు మంచి బాలుడు అన్న టైపులోనే ఆయన గురించి వార్తలు రాయాలట మరి. ఆయన గురించి న్యూట్రల్‌గానే చెప్పాలట. మల్కాజిగిరి ఏరియాలో అక్రమాలను వెలికితీసి, నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తే తప్పట. ఒకవేళ అలా చేస్తే మీడియానే అభివృద్ధి పనులను అడ్డుకున్నట్టు అవుతుందట. ఈ ఆణిముత్యాలన్నింటినీ స్వయంగా ఆయనే తాజాగా మరోసారి ప్రెస్‌మీట్ పెట్టి మరీ చెప్పారు. అందులోనూ తొలివెలుగును ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ మాట్లాడారు.
చాలా ఛానెళ్లు తన గురించి న్యూట్రల్‌గా వార్తలు రాస్తుంటాయని.. కానీ తొలివెలుగు మాత్రం ఎప్పుడూ తన తప్పులనే ప్రశ్నిస్తోందన్నారు మైనంపల్లి. ఎప్పుడూ అలాంటి కథనాలే ప్రసారం చేస్తే.. ప్రజలు నమ్మరని విచిత్రంగా మాట్లాడారు. తొలివెలుగు జర్నలిస్టు రఘు గతంలో వరదల సమయంలో మల్కాజిగిరికి టక్ వేసుకుని, సెంట్ కొట్టుకుని వచ్చి ప్రజలతో మాట్లాడారని.. మైనంపల్లి మరోసారి బురద జల్లే ప్రయత్నం చేశారు. కానీ వాస్తవానికి ఆరోజు రఘు మల్కాజిగిరిలో వరద నీటిలో నిలబడి… అదే వరద గురించి ప్రశ్నించారు. ఆ వరదల కారణమైన నిర్లక్ష్యాన్ని నిలదీశారు. ప్రజల ఆవేదనను వారి మాటల్లోనే వినిపించారు. కానీ మైనంపల్లికి అందులో చూపించిన వరద కష్టాలు, ప్రజల కన్నీళ్లు కనబడలేదు కానీ… జర్నలిస్టు వేసుకున్న దుస్తులే ఆయన దృష్టికి వెళ్లాయంటే ఇంకా ఏం చెప్పగలం?
మైనంపల్లి ప్రెస్‌మీట్ ఇక్కడితో ఆగిపోలేదు. తాను పదే పదే మాట్లాడే బూతులను సమర్థించుకోవడానికి అర్థంపర్థం లేకుండా సమాధానం చెప్పుకుంటూ వెళ్లారు. అసలు బూతులు మాట్లాడని మనిషి ఉంటాడా అని మైనంపల్లి ఎదురు ప్రశ్న. కోపం వస్తే ఎవరైనా బూతులే మాట్లాడతారని, గుడిలో పూజరి అయినా బూతులు ప్రయోగించడం సర్వసాధారణమని చెప్పుకొచ్చారు. అంతేకాదు యాక్ట్ చేసి మరీ చూపించారు. కానీ మైనంపల్లి ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏమిటంటే.. అందరూ వేరు, ఆయన వేరు.
మైనంపల్లి ఓ ప్రజాప్రతినిధి. ఆయనకు ఓటు వేసిన ప్రతివాడు విమర్శిస్తాడు.. ప్రశ్నిస్తాడు.. నిలదీస్తాడు. అవసరమైతే నడిరోడ్డుపై నిలబెట్టి తన సమస్యపై కడిగిపారేస్తాడు. అప్పుడు ఆయన సమాధానం చెప్పాల్సింది బూతులతోనో.. మాటలతోనో కాదు.- చేతలతో.. చేతనైన సాయంతో అని మైనంపల్లి గుర్తుంచుకుంటే మంచిదేమో అంటున్నారు ఆయన ఓటర్లు.
ఇంతకి మైనంపల్లికి మళ్లీ తొలివెలుగు ఎందుకు గుర్తొచ్చింది?
జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ నీటమునిగింది. డ్రైనేజీ నిర్వహణ లోపాలతో కాలనీలకు కాలనీలు నీట మునిగాయి. అలా మల్కాజిగిరిలో కూడా ప్రజలు వరదలతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వారి సమస్య గురించి తొలివెలుగు ఓ కథనాన్ని ప్రసారం చేసి.. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. కానీ మైనంపల్లి దాన్ని తట్టుకోలేకపోయారు. పరిస్థితిని చక్కదిద్దాల్సింది పోయి, సమస్యను పరిష్కరించాల్సిందిపోయి.. తొలివెలుగుపై నోరు పారేసుకున్నారు. దీంతో ఆయన తీరు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అదే వరదల్లో ఆయన్ను కడిగిపారేసినంత పనిచేశారు. కట్ చేస్తే.. ఆయన చివరికి తొలివెలుగుకు క్షమాపణ చెప్పారు. తాజాగా మైనంపల్లి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పైనా బూతులతో విరుచుకుపడ్డారు. దీంతో ఆయన తీరు మరోసారి చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో తన బూతులని సమర్థించుకుంటూ.. తొలివెలుగు పట్ల గతంంలో చేసిన తప్పును గుర్తు చేసుకున్నారు.
Advertisements