చంద్రబాబు నాయుడు సవాల్ ను ముఖ్యమంత్రి జగన్ స్వీకరించి ఎన్నికలకు సిద్ధం అవ్వాలన్నారు మాజీ ఉపముఖ్యమంత్రి, శాసనసభ్యులు, నిమ్మకాయల చినరాజప్ప. మీడియాతో మాట్లాడిన ఆయన అధికారపార్టీ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
అమరావతి రాజధాని మార్పు అనే అంశం 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజల సమస్య,రాష్ట్రాభివృద్ది సమస్య…. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కి రాజధాని అమరావతి అన్ని విధాల బాగుంటుందని రాష్ట్ర ప్రజలు ఆకాంక్షించారు.
కాని ప్రజల మనోభావాలకు విరుద్ధంగా 151 సీట్లు సాధించము అనే గర్వంతోనే రాజధాని మార్పు నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు. మీరు ఎన్నికల ముందు రాజధానిగా అమరావతే కొనసాగుతుందని మీ అనుచరులు చెప్పడం జరిగింది.
అదేవిధంగా ప్రజలు కూడా నమ్మి మిమ్మల్ని గెలిపించడం జరిగింది. ఆ రోజు నేను మాటా తప్పను….. మడమ తిప్పను అని చెప్పి ఇప్పుడు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు ఎక్కుపెట్టారు. ప్రజల ఆగ్రహానికి మీరంతా కచ్చితంగా బలవుతారని దుయ్యబట్టారు.