తెలంగాణా ఉద్యమ నేత, మాజీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డికి అవమానం జరిగింది అనే వార్త ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. గవర్నర్ నర్సింహన్ వీడుకోలు సభకు హాజరుకావడానికి పద్మా దేవేందర్ ప్రగతి భవన్ కు వచ్చారని…అయితే, ఆమెకు లోపలికి వెళ్లేందుకు అనుమతి లేదని సెక్యూరిటీ సిబ్బంది నిర్మొహమాటంగా చెప్పేసారంట.
తనని ఆపడంలో ఎదో తప్పు జరిగిందని మాజీ స్పీకర్ గేట్ వద్దే చాలా సేపు వెయిట్ చేసారని సమాచారం. అయితే సెక్యూరిటీ సిబ్బంది మాత్రం ఇక్కడ ఎటువంటి సమాచార లోపం లేదని తమకుచాలా స్పష్టమయిన ఆర్డర్లు ఉన్నాయని చెప్పారంట.
MLAల కు కాదు కేవలం మంత్రులకు మాత్రమే అనుమతి అని అన్నారట. అయితే గేట్ వద్ద ఈ వాదన జరుగుతుండగానే, తలసాని కుమారుడు సాయికిరణ్ ను లోపలికి పంపించడంతో పద్మా దేవేందర్ రెడ్డి అవమానంగా భావించారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆఖరికి తీవ్ర మనస్థాపంతో పద్మా దేవేందర్ రెడ్డి ప్రగతి భవన్ నుంచి వెళ్లిపోయారు.
ఇక్కడ ఆర్డర్లు రూల్సు ఏమి లేవని, కావాలని చేసిన చర్యే అని కొందరు ఆరోపిస్తున్నారు. పద్మా దేవేందర్ రెడ్డి, హరీష్ రావు వర్గం అన్న ఒకే ఒక్క కారణంతో ఇలా చేసారని చెప్తున్నారు. అసలే ఈటెల తూటాలు, రసమయి వ్యాఖ్యలతో ఊపిరాడకుండా ఉన్న తెరాస క్యాడర్ కు ఇది అనవసరమయిన అపవాదు గానే చెప్పుకోవచ్చు. తెలంగాణా ఉద్యమంలో ముందుండి పోరాడిన పద్మా దేవేందర్ ను ఇలా అవమానించాల్సిన అవసరం ఏముంది అని కూడా ప్రశ్నిస్తున్నారు.