మియాపూర్ భూ కుంభకోణంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ పై సీఎస్ చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు డిమాండ్ చేశారు. సర్వే నెంబర్ 78 కి సంబంధించిన భూముల కేటాయింపులో రంగారెడ్డి జిల్లా అమోయ్ కుమార్ పక్షపాత ధోరణి చూపించారని విమర్శించారు.
8 ఎకరాలు తీసుకున్న వ్యక్తికి ఒక న్యాయం 40 ఎకరాలు తీసుకున్న వ్యక్తికి మరో న్యాయమా.. అని ప్రశ్నించారు. కలెక్టర్ అమోయ్ కుమార్ అందరికీ ఒక న్యాయం చేయరా అని మండిపడ్డారు ఎమ్మెల్యే రఘునందన్ రావు. తమ లేఖను ఫిర్యాదుగా పరిగణించి కలెక్టర్ పై చర్యలు తీసుకోవాలని సీఎస్ ను కోరారు.
తమకు 10 రోజులు సమయమిస్తే మియాపూర్ భూ కుంభకోణం పై మరింత సమాచారం ఇస్తామని రఘునందన్ రావు అన్నారు. మీడియా ముందే సీస్ కు ఫోన్ చేసిన ఆయన అపాయింట్ మెంట్ కావాలని కోరారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఎప్పుడు అపాయింట్ మెంట్ ఇచ్చినా కలుస్తామని చెప్పారు. సోమేశ్ కుమార్ సీఎస్ గా ఉన్నప్పుడు తన ఫోన్ కాల్ అటెండ్ చేయలేదని.. ఆయన తెలంగాణ నుంచి రిలీవ్ అయ్యాక కాల్ చేయగానే లిఫ్ట్ చేశారని అన్నారు.