అమరావతి రైతుల ఆందోళనలు ఉద్రిక్తతకు దారితీశాయి. వైసీపీ ఎమ్మెల్యే, ఏపీ చీఫ్ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సెక్రటేరియట్ కు వెళ్తుండగా… గుంటూరు జిల్లా చినకాకాని వద్ద రాస్తారోకో చేపట్టిన రైతులు ఆయన కారును అడ్డగించారు. ఆయన కారును ముందుకు కదలనివ్వకుండా అక్కడే బైఠాయించారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ నినాదాలతో హోరెత్తించారు. ఈ క్రమంలోనే కొంతమంది ఆందోళనకారులు దూసుకువచ్చి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కారుపై రాళ్లు రువ్వారు. అక్కడితో ఆగకుండా ఆయన సెక్యూరిటీపై కూడా దాడికి పాల్పడ్డారు. దీంతో కొంతసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఇదే విషయమై ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణ స్పందించారు. రాజధాని రైతుల ముసుగులో నాపై టీడీపీ కార్యకర్తలు దాడులు చేశారని ఆరోపించారు. మాచర్ల ఎమ్మెల్యే రామకృష్ణ. నా కారుపై దాడి చేస్తే రైతుల సమస్యలు పరిష్కారం కావు. దాడి చేసింది రైతులు కాదు టీడీపి నాయకులు. రాజధాని రైతులు ఎవ్వరు చంద్రబాబు మాయలో పడొద్దు. నా పై జరిగిన దాడి వెనుక చంద్రబాబు హస్తం ఉందంటూ ఆరోపించారు పిన్నెపల్లి. చంద్రబాబు కుట్రలు ఫలించవు. కర్రలు, రాళ్లు, తీసుకుని దాడి చేసింది రైతులు కాదు. ఇలాంటి దాడులకు భయపడేది లేదంటూ హెచ్చరించారు.