ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై ఎమ్మెల్యే రఘునందన్ రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దొంగే దొంగ దొంగ అన్నట్టు వుందని ఆయన ఫైర్ అయ్యారు. మహిళా హక్కుల కోసం, మహిళా మంత్రి పదవుల కోసం తమ చెల్లె కవిత మాట్లాడలేదని ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ఇప్పుడు ఢిల్లీ ధర్నా కోసమే ఈడీ నోటీసులు వచ్చాయంటూ సింపతి కోసం జిమ్మిక్కులు చేస్తున్నారంటూ ఆరోపించారు. అడ్డదారిలో ఎమ్మెల్సీ అయిన కవిత ఉద్యమంలో ఎక్కడ ఉందని ఆయన ప్రశ్నించారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఆత్మార్పణ చేసి ఉద్యమాన్ని ఉధృతం చేసిన శ్రీకాంతచారి తల్లి శంకరమ్మ ఎమ్మెల్యే లేదా ఎంపీ, ఎమ్మెల్సీ ఎందుకు కాలేదని ఆయన ప్రశ్నించారు.
మెదక్ పట్టణంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కవితకు ఇచ్చిన ఈడీ నోటీసులకు తెలంగాణ సమాజానికి సంబంధం లేదని ఆయన చెప్పారు. ఇది బీఆర్ఎస్‌కు సంబంధం లేని అంశమన్నారు.
బీఆర్ఎస్ అధ్యక్షునికి చెప్పి కవిత ఈ వ్యాపారం చేసింది తాను అనుకోవడం లేదన్నారు. 2014లో రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారం చేపట్టిన సమయంలో కేసీఆర్ మంత్రి వర్గంలో ఒక్క మహిళా లేదని మండిపడ్డారు. ఆ సమయంలో కవిత తన పదవికి రాజీనామా చేసి ఉంటే ఆమెకు తెలంగాణ మహిళలు బ్రహ్మరథం పట్టేవారన్నారు.