- నిఘా వ్యవస్థ నిద్రపోయిందంటూ రఘునందన్ కౌంటర్..
ఆర్మీ నియామకాలకు కేంద్రం ప్రకటించిన అగ్నిపథ్ స్కీమ్ దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు రగుల్చుతోంది. ఆందోళనకారులు గత రెండు రోజులుగా జరుపుతున్న హింసాత్మక చర్యలతో పరిస్థితి రణరంగంగా మారింది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ విధ్వంసంపై వివిధ పార్టీలు బీజేపీపై ఫైరవుతుంటే,.. కాషాయ నేతలు కౌంటర్ ఎటాక్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు స్పందించారు. తెలంగాణలో నిఘా వ్యవస్థ నిద్రావస్థలో మునిగిపోయిందని విమర్శలు గుప్పించారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో రైళ్లను తగులబెట్టడం వెనుక టీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్ హస్తం ఉందని రగునందన్ రావు ఆరోపించారు. ఆందోళనకారులను కంట్రోల్ చేయడంలో విఫలమైన డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్ రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పై దాడికి వేలమంది తరలివస్తుంటే నిఘా వ్యవస్థ కూడా ఫామ్ హాజ్ లో పడుకుందా అంటూ రఘునందన్ రావు చురకలు అంటించారు. కాంగ్రెస్ నాయకురాలు ఎస్సై కాలర్ పట్టుకుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్ వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయడానికే నిన్నటి రాజ్ భవన్ ముట్టడి డ్రామా అని ఆయన ఆరోపించారు.
Advertisements
మంత్రులపై, ఎమ్మెల్యేలపై దాడులు చేస్తే ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తోందని రఘునందన్ మండిపడ్డారు. సైన్యంలో చేరాలనుకునే యువకులు అల్లర్లకు పాల్పడరు. రాష్ట్ర ప్రభుత్వమే గూండాలను పంపి అల్లర్లను ప్రోత్సహిస్తోందని ఆయన విమర్శించారు.