దుబ్బాక నియోజకవర్గంలో ప్రొటోకాల్ రగడ చోటుచేసుకుంది. జిల్లా అధికారులు ప్రొటోకాల్ పాటించటంలేదని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఆయన శనివారం బీఆర్కే భవన్‌లో సీఎస్ సోమేష్ కుమార్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
జిల్లాలో అధికారులు ప్రొటోకాల్ పాటించడం లేదని ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. ఈ మేరకు అభివృద్ధి కార్యక్రమాలు, పలు పనుల ప్రారంభోత్సవానికి సంబంధించి శిలా ఫలకాలపై తమ పేర్లు పెట్టకుండా.. అధికార పార్టీ నేతల పేర్లు మాత్రమే పెడుతున్నారని సీఎస్‌కు వివరించినట్లు చెప్పారు.
రాజకీయ ఒత్తిడి కారణంగా జిల్లా యంత్రాంగం ఇలా చేయడం సరికాదని ఫైర్ అయ్యారు. జిల్లా అధికారుల తీరు మారాలని సూచించారు. ఈ విషయం పరిష్కరించకుంటే అసెంబ్లీ సెక్రటరీకి ఫిర్యాదు చేస్తామన్నారు. ఇద్దరు స్పందించకపోతే కోర్టుకు వెళతామని హెచ్చరించారు.
ఈ విషయంలో ఇప్పుడు నిర్ణయం తీసుకోకుంటే భవిష్యత్తులో ఇతర జిల్లాలకు కూడా విస్తరించే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం దుబ్బాకలో ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యేగా పరిస్థితి మారిపోయింది.